టెండర్‌ కథ అడ్డం తిరిగింది ! | Corruption in Entry Fees Tenders Chittoor | Sakshi
Sakshi News home page

టెండర్‌ కథ అడ్డం తిరిగింది !

Published Wed, Sep 12 2018 10:39 AM | Last Updated on Wed, Sep 12 2018 10:39 AM

Corruption in Entry Fees Tenders Chittoor - Sakshi

ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

చిత్తూరు ,బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ అటవీ శాఖ ప్రాంగణంలోకి వచ్చే సందర్శకుల నుంచి వసూలుచేసే ఎంట్రీ ఫీజు వసూలుకు నిర్వహించిన టెండర్‌ కథ అడ్డం తిరిగింది. ఊహించని విధంగా టెండర్‌ దాఖలై అటవీ శాఖకు ఆదాయం వచ్చిందని ఉన్నతాధికారులు ఆనందపడినా... అది మూన్నాళ్ల ముచ్చటయ్యింది.

హార్సిలీకొండపై అటవీ సముదాయంలో మినీ జూ, ప్రకృతి అధ్యయన కేంద్రం, పిల్లల పార్కు ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి సందర్శకులు రావాలంటే రూ.10 ఎంట్రీ ఫీజు చెల్లించాలి. దీనికోసం గతేడాది టెండర్లు నిర్వహించగా, అత్యధిక టెండర్‌ రూ.6,07,500 దక్కించుకుంది. ప్రస్తుతం ఏడాది లీజు కోసం గత నెలలో నిర్వహించిన టెండర్లలో ఊహించని విధంగా కొండకు చెందిన సుభహాన్‌ రూ.11,26,786కు టెండర్‌వేసి దక్కించుకున్నారు. గత నెల 29వ తేదీ ఈ టెండర్‌ను డీఎఫ్‌ఓ కమిటీ ఖరారు చేసింది. టెండర్‌దారుడు నిబంధనల మేరకు టెండర్‌ సొమ్ములో 50 శాతం చెల్లించి ఎంట్రీ ఫీజు వసూలు చేపట్టాలి. అయితే టెండర్‌ ఖరారుచేసి రెండు వారాలైనా ఇప్పటివరకు టెండర్‌దారుడు సుభహాన్‌ సొమ్ము చెల్లించలేదు.

ఈ రోజు, రేపు అంటూ కాలయాపన చేస్తుండటంతో టెండర్‌దారుడు ముందుకొచ్చే పరిస్థితి లేదని అధికారులకు స్పష్టమైంది. దీంతో అధికారులు ఇప్పుడు రెండో అత్యధిక టెండర్‌దారునికి ఈ టెండర్‌ ఖరారు చేయాలి. అయితే ఇక్కడో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఓ అటవీ ఉద్యోగి ఈ టెండర్‌ దక్కించుకోవడం కోసం తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం కొండపై జోరుగా సాగుతోంది. ఈ కారణంగానే మొదటి టెండర్‌దారుడు తప్పుకుంటున్నాడని భోగట్టా. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే మొదటి టెండర్‌దారుడు ముందుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత టెండర్‌లోనూ ఓ అటవీ ఉద్యోగి కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. ఈ నేఫథ్యంలో టెండర్‌ వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చినట్టుంది. దాఖలైన టెండర్లను వరుసగా పరిశీలిస్తే..సుభహాన్‌ (హార్సిలీహిల్స్‌)–రూ.11,26,786, రవి (పీ.కొత్తకోట)–రూ.9.11 లక్షలు, మురళీకృష్ణ (మదనపల్లె)–8.50 లక్షలు, సుధాకర్‌ (మదనపల్లె)–రూ.8 లక్షలు, కే.కృష్ణ (చిత్తూరు)–రూ.6,91,990, శరవణ నఘ (చిత్తూరు)–రూ.7,51,777 ఉన్నాయి. ఒక్కొక్కరు రూ.50 వేలు డిపాజిట్టు చెల్లించి టెండర్‌ వేయగా, అత్యధిక టెండర్‌దారుని డిపాజిట్టు మినహా మిగిలినవారి డిపాజిట్లను తిరిగి చెల్లించారు.

’ఏం చేయబోతారో
మొదటి టెండర్‌దారుడు సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో రెండో అత్యధిక టెండర్‌దారునికి కట్టబెడతారా ? లేదా కొత్తగా మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా ? అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహరంలో ఏదో జరుగుతోందన్న అనుమానం ఉన్నతాధికారుల్లోనూ ఉంది. ఈ పరిస్థితుల్లో డిపాజిట్టు విలువను తగ్గించి అత్యధిక సంఖ్యలో టెండర్లు దాఖలయ్యేలా చర్యలు తీసుకుంటే అనుమానాలు తీరుతాయి. లేదంటే జరుగుతున్న ప్రచారం నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

డిపాజిట్‌ ఇవ్వబోం
అత్యధిక టెండర్‌దారు సుభహాన్‌ టెండర్‌ సొమ్ము చెల్లించడం లేదు. దీంతో అతడు చెల్లించిన రూ.50 వేలు డిపాజిట్‌ తిరిగి ఇవ్వబోం. అటవీశాఖ ఖాతాలో జమచేస్తాం. టెండర్‌ ఎవరికి ఖరారు చేయాలన్నది ఇంకా నిర్ణయం జరగలేదు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకొవాల్సి ఉంది.–ఈశ్వరయ్య, రేంజర్,టెండర్‌ కమిటీ సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement