సాక్షి, మచిలీపట్నం: సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల నిర్వహణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్లు పందేల నిర్వహణ తదితర అంశాలపై సంది గ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రం గా పరిగణించాలన్న హైకోర్టు.. బరులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా జరిగినట్లు సమాచారం అం దితే బాధ్యులపై చర్యలకు వెనుకాడొద్దని చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఓ తీర్పును వెలువరించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జీవహింసకు పాల్పడితే సహించబోమని, కోళ్లకు కత్తులు కట్టే ప్రక్రియకు స్వస్తి పలకాలని, సంప్రదాయ పందేలతో ఆనందించాలని సూచించింది. కోర్టు తీర్పుతో పం దెం రాయుళ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బరిలోకి దించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో కోడి పందేల నిర్వహణకు పందెంరాయుళ్లు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు అవసరమైన నిర్వహణ కేంద్రాలను సైతం చదునుచేసి, టెంట్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లావ్యాప్తంగా అంతా సిద్ధం
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో నిర్వహణ కేంద్రాలు సిద్ధమయ్యాయి. మేకవానిపాలెం, గోపువానిపాలెం, శ్రీనివాసనగర్, పోలాటితిప్ప, చిన్నాపురం, సీతారామపురం, గుండుపాలెం, గూడూరు మండలంలో గూడూరు, పోసినవారిపాలెం, పెడన మండలంలో కొంకేపూడి, నందమూరు, కాకర్లమూడి, మొవ్వ మండలం కాజ, గుడ్లవల్లేరు, డోకిపర్రులో పరదాలు సిద్ధం చేశారు. బంటుమిల్లి, ముదినేపల్లి మండలం వడాలి, పెదపాలపర్రు, పెనమలూరు, వణుకూరు, యనమలకుదురు గ్రామాల్లో కోళ్లకు కత్తులు కట్టే నిపుణులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పోరంకి, ఈడ్పుగల్లు, తాడిగడప, గోడపర్రు గ్రామాల్లో గత మూడు రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. నూజివీడు, నున్న మామిడి తోటల్లో బరులు సిద్ధమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, సుప్రీంకోర్టు జీవ హింస చేయకూడదన్న తీర్పుతో వెనక్కు తగ్గుతారా? లేక ముందుకెళ్తారా? అన్న మీమాంస నెలకొంది.
మోపిదేవిలో భారీ సెట్టింగులు
మోపిదేవీ మండలం వెంకటాపురం గ్రామంలో భారీ స్థాయిలో పందేల నిర్వహణ జరుగుతోంది. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేల నిర్వహణ చేస్తుంటారు. గత ఏడాది సినీ తారలు సైతం ఇందులో పాల్గొనడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పందేలు సైతం భారీస్థాయిలో కాయడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. రూ.కోట్లు చేతులు మారతాయి.
సిటీ శివారులో జాతరే..
విజయవాడ: సంక్రాంతి సంబరాల ముసుగులో అధికార పార్టీ నేతలు కోడిపందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ శివారు భవానీపురం, గొల్లపూడి, పోరంకి, ఈడ్పుగల్లు, పెదపులిపాక, నిడమానూరు, ఏరియాల్లో ఇప్పటికే బరులు సిద్ధమయ్యాయి. ఇవికాక ఆగిరిపల్లి మండలంలోని నెక్కలం, గొల్లగూడెం, శోభనాపురం, గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, మానికొండ తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధం చేశారు. ఉయ్యూరు సమీపంలో బోళ్లపాడు, మైలవరం, ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. పెనమలూరు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పేకాట కోసులు సిద్ధం చేశారు. రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని కోత ముక్క జూదం ఆడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కోసులకు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జూదరులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment