బందరు మండలం శ్రీనివాస్‌నగర్ బరిలో దృశ్యాలు
పందెం రాయుళ్ల పంతం ముందు హైకోర్టు ఆంక్షలు నిలబడలేదు. కోడి పుంజులకు కత్తులు కట్టి పందేలు వేస్తే జైలుకు పంపుతామని పోలీసులు చేసిన హెచ్చరికలను ఎవ్వరూ ఖాతరు చేయలేదు. సంక్రాంతి ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కత్తి కట్టి కోడి పందేలు నిర్వహించారు. అధికారపార్టీ నేతల అండదండలతో జూదం విచ్చలవిడిగా సాగిపోయింది. రాత్రికి రాత్రే ఏర్పాట్లు పూర్తి చేసి భారీ ఎత్తున వేసిన షామియానాలు, గ్యాలరీల్లో పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. అనుబంధంగా పేకాట, గుండాట, నంబర్ల ఆటలు సైతం జోరుగా సాగాయి. వారం రోజుల నుంచి తనిఖీల పేరుతో హడావుడి చేసిన పోలీసులు పండుగ రోజుల్లో చేష్టలుడిగిపోయారు.
సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో కంకిపాడు, బాపులపాడు, ముసునూరు, కైకలూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో రూ.కోట్లలో కోడిపందేలు జరిగాయి. ఇక్కడ భోగి పండుగ రోజున జరిగిన పందేలకు తెలుగు రాష్ట్రాల్లోని బడాబాబులు ఖరీదైన కార్లలో హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు.
♦ పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం ఈడుపుగల్లులో హోరెత్తించే మైకులు, క్రీడా మైదానాలను తలపించే రీతిలో ఏర్పాటు చేసిన బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. దీంతో పాటు గొడవర్రు, గండిగుంట, కాటూరు, బోళ్లపాడు, ఆకునూరు, పెదపులిపాక తదితర ప్రాంతాల్లో సిద్ధం చేసిన బరులుకోడిపందేలకు మరోసారి వేదిక అయ్యాయి. ముసునూరు మండలం కొత్తూరు గ్రామంలోనూ పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు.
♦ తిరువూరు నియోజకవర్గ పరిధిలో కోకిలంపాడు వెళ్లే రహదారిలో మినీస్టేడియం వెనుక, కాకర్ల, ముష్టికుంట్ల, చీమలపాడు, రేపూడి, పోలిశెట్టిపాడు, విస్సన్నపేట, కొండపర్వ, కలగర, పుట్రేల, తెల్లదేవరపల్లి, గంపలగూడెం మండలం గొల్లపూడి, ఊటుకూరు, నెమలి, కనుమూరు కోడి పందేలు నిర్వహించారు.
♦ కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కైకలూరు, ఆటపాకలో సిద్ధం చేసిన బరుల్లో కోళ్లు కాళ్లు దువ్వాయి. కలిదిండి, కోరుకొల్లు, ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి వైవాక, మండవల్లి మం డలంలో మండవల్లి, భైరవపట్నం, చింతపాడుల్లోనూ కోడిపందేలు నిర్వహించారు. ఆటపాకలో టీడీపీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు.
♦ నూజివీడు నియోజకవర్గ పరిధిలో జనార్దనపురం, పోతనపల్లి, చీపురుగూడెం, చనుబండ, ముసునూరు, సూరేపల్లి, కొత్తూరు, సుంకొల్లు, గొడుగువారిగూడెం, కాట్రేనిపాడు, చక్కపల్లి, ఆగిరిపల్లి, ఈదరలోనూ పందేలు జరిగాయి.
♦ మైలవరం నియోజకవర్గ పరిధిలో బాపులపాడు మండలం అంపాపురం, ఉంగుటూరు మండలం ఇందుపల్లి, నందిగామ మండలం చందాపురం, కలిదిండి మండలం తాడినాడ, రెడ్డిగూడెం మండలం నాగులూరు, చండ్రగూడెం తదితర ప్రాంతాల్లోనూ భారీస్థాయిలో జరిగాయి.
♦ మచిలీపట్నం నియోజకవర్గంలోని గోపువానిపాలెం, శ్రీనివాసనగర్, పోలాటితిప్ప ప్రాంతాల్లో కూడా బహిరంగంగానే బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించినా పోలీసులు పట్టించుకోలేదు.
♦ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, షేర్‌మహ్మద్‌పేటలతో పాటు నగరశివార్లలోనూ అలాగే నందిగామ మండలం కంచికచర్లలో రెండు, చందర్లపాడులో రెండు బరుల్లోనూ నిర్వాహకులు పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ పందేలు నిర్వహించడం గమనార్హం.
♦ విజయవాడ భవానీపురం, ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే భవానీపురంలో ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న అనుచరలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా పందేలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు.
రూ.150కోట్లు పైమాటే..
సంక్రాంతి సందర్భంగా జిల్లాలో సోమవారం కోడి పందేలు, పేకాట జోరుగా సాగాయి. కొన్ని చోట్ల పోలీస్‌స్టేషన్లకు కూతవేటు దూరంలోనే కోడిపందాలు జరుగుతున్నాయి. కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, నంబర్లు, ఎరుపు తెలుపు ఆటలు జోరుగా సాగుతున్నాయి. పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిలో పాల్గొంటున్నారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారితో కోడిపందేల బరులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో కోడిపందేల్లో రూ.కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఇందులో మద్యానిది 50 శాతం భాగం కావడం విశేషం. ఈ ఏడాది కూడా రూ. 150 కోట్లకు పైగా చేతులు మారే అవకాశం ఉన్నట్లు అంచానా. చాలాచోట్ల పగలు, రాత్రి సమయాల్లో కూడా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
హాజరైన తెలంగాణఎమ్మెల్యేలు, ఎంపీలు
నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం వేల్పుచర్ల శివారు కొత్తూరులో నిర్వహించిన కోడిపందేలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ యాక్టర్లు హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌లతో పాటు సినీ కమేడియన్ శివారెడ్డి, జబర్దస్త్ కమేడియన్ వేణు, రాకేష్‌లు విచ్చేశారు. శివారెడ్డి చంద్రబాబులా మిమిక్రీ చేస్తూ పందేలకు వచ్చిన జనాన్ని కడుపుబ్బ నవ్వించారు. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు జెడ్పీటీసీలు సైతం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment