‘బరి’ తెగించారు | hen fights in home minister constiture | Sakshi
Sakshi News home page

‘బరి’ తెగించారు

Published Mon, Jan 15 2018 11:33 AM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM

hen fights in home minister constiture - Sakshi

అధికార పార్టీ నేతల దన్నుగా జూదగాళ్లు ‘బరి’ తెగించారు. అనుకున్నట్టుగానే పందెం కోళ్లతో కాళ్లు దువ్వించారు. పదుల సంఖ్యలో బోర్డులు ఏర్పాటు చేసి గుండాటలు నిర్వహించారు. తాత్కాలిక బెల్టు షాపులు పెట్టి మద్యాన్ని ఏరుల్లా పారించారు. చట్టాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూ చెలరేగిపోయారు. కోర్టు ఆంక్షలు.. పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ జూదాల నిర్వాహకులు కోడి పందేలు.. గుండాటలు నిర్వహించి తమ సత్తాచాటారు. కోడి పందేలు కాకుండా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది పుంజుల పందేలు, ... పొట్టేలు పందేలు...సూట్‌బాల్‌ పందేలతో ‘కాయ్‌రాజా కాయ్‌’ అంటూ స్వైర విహారం చేశారు.

అమలాపురం: అటు పందేల్లో కోళ్లు...ఇటు నోట్ల కట్టలు తెగ తెగిపడుతున్నాయి. వేల రూపాయలతో మొదలై లక్షల రూపాయలు దాటాయి. ఒకప్పుడు చాటుమాటుగా సాగే పందేలు ఇప్పుడు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగాయి. కోనసీమలోని నియోకవర్గాల్లో ఈ జోరు ఎక్కువగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు సాగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో పందేలు తారస్థాయికి చేరుకున్నాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు లాంఛనంగా ప్రారంభించారు. తొలిసారి సూట్‌బాల్‌ బాల్‌ పందేలకు శ్రీకారం చుటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపార ప్రముఖులు తరలిరావడంతో అంచనాలకు మించి బెట్టింగులు జరిగాయి. అందరికీ కనిపించే విధంగా ఇక్కడ ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సుమారు ఐదు వేల మంది కూర్చొనేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు.

హోంమంత్రి నియోజకవర్గాల్లో...
శాంతి భద్రతలు పర్యవేక్షించి.. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గమైన  పెద్దాపురం, ఆయన సొంత ప్రాంతమైన అమలాపురం నియోజక వర్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. ఒక్క పెద్దాపురం నియోజకవర్గంలోనే ఎనిమిది చోట్ల పందేలు జరగడం విశేషం. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జోరుగా సాగాయి. వీటికి చిన్నాచితకా పందేలు అదనం. ఈ నియోజకవర్గంలోనే రూ.2.50 కోట్ల వరకూ చేతులు మారాయి. అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం మండలాల్లో పందేలు.. గుండాటలు జోరుగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంకల్లో రూ.కోటికి పైగా పందేలు జరిగాయి. ఇక్కడ ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల మధ్య సాగింది.
ఇవే కాకుండా జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, లక్కవరం, రాజోలు, చింతలపల్లిలో, మామిడికుదురు మగటపల్లిలో ఆరుచోట్ల పందేలు నిర్వహిస్తున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవులపల్లి,  ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో,  మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం లంకల్లోనూ ఇదే జోరు కొనసాగింది.

కొత్త తరహాలో ఎనిమిది పుంజుల పందెం
ఆత్రేయపురం మండలం లొల్ల, వసంతవాడ, పేరవరం, బొబ్బర్లంక, ర్యాలీ, తాడిపూడి, నార్కెడుమిల్లిలో పందేలు శనివారం రాత్రి 11 గంటల నుంచే ఆరంభించారు. ఇక్కడ తొలిసారిగా ఎనిమిది పుంజుల పందేలు జరుగుతున్నాయి. సాధారణంగా రెండు పుంజులను బరిలోకి వదిలి పందెం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఎనిమిది పుంజులను ఒకేసారి వదిలి పోటీ పెడుతున్నారు. ఇంచుమించు అన్ని పుంజులు మీద పందెం కాస్తారు. కానీ చివరి వరకు నిలిచే పందెం కోడి మీద కాసినవారికి మాత్రమే జూదం గెలుస్తున్నారు. రూపాయి పందెం కాస్తే ఏడు రూపాయిల వరకు వచ్చే అవకాశముండడంతో ఈ పందేలపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పుంజుమీద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలు కాస్తున్నారు.

గుండాట.. మద్యమే... ప్రధాన ఆదాయం
కోడిపందేల నిర్వాహకులకు గుండాటల్లో ఆదాయం కనిపిస్తుండడంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు. జూదగాళ్లు సైతం గుండాటల్లోనే పెద్ద ఎత్తున సొమ్ములు కాస్తున్నారు. మురమళ్లలో జరిగిన గుండాట పందేనికి వచ్చి రూ.30 వేలు కాసిన వారు కూడా ఉన్నారు. మద్యం అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. తాగినవారికి తాగినంతగా అందుబాటులో ఉంచారు. మురమళ్ల వంటి చోట అందుబాటులో ఖరీదైన మద్యాన్ని కూడా ఉంచడం గమనార్హం.

ఖాకీల మౌనం...
పందేలు జరగనిచ్చేది లేదంటూ హెచ్చరించిన పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి మౌనం వహించారు. పందేలను చూసీచూడనట్టుగా వదిలేశారు. హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలో టీడీపీ పెద్దల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారు. విచిత్రమైన విషయం ఏమిటంటే గత ఏడాదికన్నా ఈ ఏడాది పందేల బరులు రెట్టింపు కావడం విశేషం. కోడి పందేలంటే ముందుగా గుర్తుకువచ్చే పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం వరకు పోలీసులు పందేలు జరగకుండా చూడగలిగారు. కానీ ఈ జిల్లాలో మాత్రం శనివారం అర్ధరాత్రి నుంచే ఊపందుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement