ప్రత్యక్ష రాజకీయాలకు చినరాజప్ప సోదరుడి దూరం
వర్గ విభేదాలే కారణమంటూ తమ్ముళ్ల గుసగుసలు
తూర్పు గోదావరి: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి రోజురోజుకూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు వరుస రాజీనామాలు చేయడం, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం వంటి పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఒకపక్క 2009 ఎన్నికల నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించి నిరాశ చెందిన పరమట శ్యామ్‌కుమార్‌కు ఈ సారీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో స్వతంత్ర (రెబల్) అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఇదే క్రమంలో నియోజకవర్గ టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న మండలానికి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటన చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. జగ్గయ్యనాయుడు దూరంగా ఉంటానన్న ప్రకటన వెనుక నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిమాణాలే కారణమని సమాచారం. పరమట శ్యామ్‌కుమార్ రెబల్‌గా పోటీ చేయడంపై తెర వెనుక తన అన్నయ్యతో పాటు తన ప్రమేయం ఉందన్న గుసగుసలు జగ్గయ్యనాయుడిని కొంచెం బా«ధించాయి.
టీడీపీలో జరుగుతున్న ఈ అనూహ్య పరిణామాలతో తనకు సంబంధం లేదన్న బాధతో రాజకీయాలకు దూరమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తన సోదరుడు చినరాజప్పతోనూ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఆనందరావుతోనూ ఎడమోహం పెడమోహంతో ఉంటున్న జగ్గయ్యనాయుడు పొమ్మనకుండానే పొగ పెడుతున్నట్టు ముందుగానే గుర్తించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్న మాటతో పరోక్షంగా టీడీపీకి దూరమవుతున్న సంకేతాలను తెలియజేశారు. ఇటీవల అల్లవరం మండలానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు అడపా కృష్ణ పారీ్టకి రాజీనామా చేసి రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్‌కుమార్ పక్కన చేరడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇలా వరుస ప్రతికూల ప్రకటనలతో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment