
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?
కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.
పవన్‌కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.
ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్‌లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment