తలపడుతున్న కోళ్లు
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: సంక్రాంతి కోడి పందేలు జోరందుకుంటున్నాయి. పందెంగాళ్లు సై అంటే సై అంటున్నారు. కోడి పందేల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల రహస్యంగా బరులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది కూడా భారీగా పందేలు నిర్వహించేందుకు పలువురు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెంగాళ్లు ఎలాగైనా నిర్వహించాలన్న ఉత్సాహంతో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కోడి పుంజులకు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. జిల్లాలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, కొత్తపేట, అమలాపురం, రావులపాలెం, కాకినాడ రూరల్, సిటీ, పిఠాపురం, తుని, జగ్గంపేట, మండపేట, రాజానగరం, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాలోనూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు బరులు ఏర్పాట్లు చేశారు.
పోలీసుల వైఫల్యం వల్లే...
జిల్లాలో ఏటా సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వాటి నియంత్రణలో మాత్రం పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. సీజన్‌లో అడపాదడపా దాడులు చేస్తూ నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుటున్నారని, బడా పందెగాళ్లపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు, చోటామోటా రాజకీయ నాయకులు సైతం కోడి పందేల నిర్వహణలో పాల్గొడం గమనార్హం. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే పోలీసులు కోడిపందేలు వేయవద్దని, 144 సెక్షన్ అమలులో ఉందని, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో సమావేశాలు పెట్టి హడావుడి చేయడం పరిపాటిగా మారింది. పండుగ నాలుగు రోజులు పెద్ద ఎత్తున కోడిపందేలు షరామామూలే.
గతేడాది కూడా పోలీసులు గ్రామాల్లో దాడులు నిర్వహించడం, తరువాత అనుమతులు ఇవ్వడం, ఎస్‌ఐ స్థాయి అధికారి నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు కోస మాంసం ఇవ్వాలని ఒక్కొక్క బరి నుంచి 65 నుంచి 90 కోసలు కావాలని నిర్ణయించడంతోపాటు రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పోలీసులు వసూలు చేశారని... ఇప్పుడు కూడా అదే జరుగుతుందని, పందేలు మాత్రం ఆపరని నిర్వాహకులు చెబుతున్నారు.
232 కేసులు..500 మంది బైండోవర్
కోడి పందేలు ఆడే వ్యక్తులుగా గుర్తించి ఇప్పటి వరకు జిల్లాలో 232 కేసులు పెట్టి 500 మందిని బైండోవర్ చేశారు. కోడిపందేలు ఆడుతున్న స్థలాలపై దాడులు చేసి 10 కేసుల్లో 8 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 30 కోళ్లు, 25 కత్తులు, రూ.40 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పేకాట శిబిరాలపై దాడి చేసి 25 కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.10 లక్షల నగదు, ఆరు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు.
కోడిపందేలపై ఉక్కుపాదం
సంక్రాంతి పండుగకు కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించింది. వీటిపై ఇప్పటికే టాస్క్‌ఫోర్సు టీములు తిరుగుతున్నాయి. కోడిపందేలు, పేకాట, మట్కా, గుండాట తదితర నిషేధిత ఆటలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి.– విశాల్ గున్ని, ఎస్పీ, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment