సర్వే తోటల మధ్యలో కోడిపందేల నిర్వహణ(ఫైల్)
శ్రీకాకుళం , ఎల్.ఎన్.పేట: ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో కాకపోయినా ఎంతోకొంత వరకు జిల్లాలో కోడిపందేలు సాగుతుంటాయి. ఏటా పందేల నిర్వాహణకు ఒకస్థాయి నుంచి భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. అలికాం–బత్తిలి రోడ్డుకు ఎగువున, మండలంలోని కొత్తబాలేరు, కవిటి, కొత్తపేట, చొర్లంగి, కొత్తవలస గ్రామాలకు సమీపంలోని కొండల్లో జీడి, నీలగిరి, సర్వేతోటల్లో ఈ పందేలు నిర్వహిస్తుంటారు. కోడి పందేలతో పాటు సూట్(పేకాట) ఆటలు కూడా ఆదే ప్రాంతంలో జరుగుతుంటాయి. వీటి నిర్వాహణ పరిసర గ్రామాలకు చెందిన వారే ప్రధాన బాధ్యతలు తీసుకుంటారని, వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. గత 20 ఏళ్లుగా పందేల నిర్వాహణ కొనసాగుతునే ఉంది. ఒకటి, రెండుసార్లు జూదగాళ్ల ఆటలు సాగకుండా స్థానిక పోలీసులు అణచివేశామని చెప్పుకున్నా భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో పందేలు మాత్రం జరిగిపోతునే ఉంటాయి.
సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్‌కు ఈ 3 నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్‌ఐలు మారడంతో తమను ఎవరూ పట్టించుకోలేరన్న ధీమాలో నిర్వాహాకులు ఉన్నారు. సరుబుజ్జిలి పరిధిలోని ఎల్.ఎన్.పేట మండలంలో పందేల ప్రాంతాలు మారు మూలన ఉన్నాయి. ఈ ప్రాంతంతో సంబంధం లేని కొత్తవారు ఎవరైనా వచ్చినా.. అనుమానంగా ఉన్న వ్యక్తులు పందేలు జరిగే దారిలో వెళ్తున్నా.. వారిని పసిగట్టిన నిర్వాహాకుల వేగులు ఫోన్ల ద్వారా క్షణాల్లో సమాచారం చేరవేస్తుంటారు. వెంటనే నిర్వాహాకులు వారి మకాం మార్చి తప్పించుకుంటారు. పందేలు జరిగే ప్రాంతంలో సూట్(పేకాట) కూడా భారీ స్థాయిలో జరుగుతుందని తెలుస్తుంది. కోడి పందేల నిర్వాహాణ ఈ ఏడాది మరింత ఉత్సాహాంగా, ఎక్కువ రోజుల పాటు నిర్వహించే అవకాశం లేకపోలేదని ఈ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది. పందేల నిర్వాహాణకు కోడి పుంజులను సిద్ధం చేసుకున్నారు. ఒక్కొక్క కోడి పుంజు ధర తక్కువగా రూ.2 వేల నుంచి రూ.10 వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. వీటి నిర్వాహణపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment