కోళ్ల కోట్లాట | hen fights in guntur district | Sakshi
Sakshi News home page

కోళ్ల కోట్లాట

Published Wed, Jan 17 2018 7:59 AM | Last Updated on Fri, Aug 10 2018 9:50 PM

hen fights in guntur district - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో :సంక్రాంతి సంప్రదాయం పేరిట అధికార పార్టీ నాయకులు బరులు ఏర్పాటు చేసి మరీ కోడిపందేలు నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టొద్దని కోర్టు స్పష్టంచేసినా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ఇప్పుడు చట్టం కళ్లకు గంతలు కట్టి న్యాయస్థానం ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు డమ్మీలను రంగంలోకి దించుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించీ పండుగ మూడురోజులు సాగించిన రూ.వెయ్యికోట్ల కోడిపందేల దందాను కప్పిపుచ్చేందుకు వ్యూహరచన చేశారు. పోలీసులు వారికి వంతపాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతిలో రూ.వెయ్యి కోట్ల దందా
సుప్రీంకోర్టు ఉత్తుర్వులు అమరావతిలో అధికార పార్టీ నేతల ప్రాబల్యం ముందు వీగిపోయాయి. కృష్ణా జిల్లాలో దాదాపు వంద బరులు, గుంటూరు జిల్లాల్లో మరో  50 బరులు ఏర్పాటు చేశారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలను రక్తికట్టించారు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి మరీ రాత్రింబవళ్లూ కోడి పందేలు నిర్వహించారు. పందేల మాటున టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు రూ.కోట్లు కొల్లగొట్టారు. బరుల నిర్వహకులు ఒక్కో పందెం మొత్తం మీద 10 శాతం కమీషన్‌ వసూలు చేశారు. అంటే రూ.5 వేలు పందెం కడితే రూ.500 నిర్వాహకులకు కమీషన్‌గా ఇచ్చేయాలి. రెండు జిల్లాల్లో రూ.వెయ్యికోట్ల పందేలు సాగాయన్నది అంచనా. ఆ ప్రకారం బరుల నిర్వాహకులైన టీడీపీ నేతలు కమీషన్ల రూపంలోనే రూ.100 కోట్లు జేబుల్లో వేసుకున్నారు. ఇక బరుల వద్ద సాగిన మద్యం, జూదం దందా సరేసరి. ఎమ్మార్పీ మీద 30 శాతం వరకు ధర పెంచేసి మరీ జోరుగా విక్రయాలు సాగించారు. నిర్వాహకులైన టీడీపీ నేతలు మద్యం అమ్మకాల్లో 20 శాతం కమీషన్‌గా వసూలు చేశారు. దీంపాటు మట్కా, పేకాట జూదం యథేచ్ఛగా సాగింది. మట్కా, పేకాట జూదం నిర్వాహకులు కూడా టీడీపీ నేతలకు 20 శాతం కమీషన్‌గా ఇచ్చారు. ఈ లెక్కలన కోడి పందేలు, మద్యం, మట్కా జూదాల ద్వారా టీడీపీ నేతలు ఈ మూడురోజుల్లో వందలకోట్లు కొల్లగొట్టారు.

మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం
సంప్రదాయం ముసుగులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహించిన కోడిపందేల దందాలకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. కత్తులు కట్టి కోడిపందేలతోపాటు మద్యం, జూదం దందాలవైపు కనీసం కన్నెత్తి చూడనేలేదు. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్‌ యంత్రాంగాలను ‘సంతృప్తి’పరిచారు. ఒక్కో పోలీస్‌ స్టేషన్, ఎక్సైజ్, తహసీల్దార్‌ పరిధిలోని బరుల నిర్వాహకులు భారీగానే కమీషన్లు ముట్టజెప్పారని తెలుస్తోంది.

తూర్పుపాలెంలో..
తూర్పుపాలెం(చెరుకుపల్లి): సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజులపాటు నిబంధనలకు విరుద్ధంగా సంక్రాంతి పండుగ ముసుగులో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీగా కోడి పందాలను కోట్లలో నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో సుమారు 35 ఎకరాల్లో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలతోపాటు, గుండాట, కోతముక్క వంటి జూద క్రీడలను సైతం యథేచ్చగా నిర్వహించారు. కోడి పందేలను స్వయంగా ప్రజాప్రతినిధులే ప్రారంభించారు. సంప్రదాయ పేరుతో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిబంధనలను పాటించకుండా, చట్టాలను అతిక్రమించి తమ ఇష్టానుసారం కోడి పందేలను నిర్వహించడంపై తీవ్ర  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో సుమారు రూ. 10 కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. బాపట్ల ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ ముమ్మినేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావులతోపాట పలువురు టీడీపీ నాయకులు స్వయంగా పందేలను పర్యవేక్షించారు.

ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు
కోడి పందేల ముసుగులో జూద క్రీడలు యథేచ్చగా నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు తమకేం పట్టనట్లుగా ప్రేక్షకప్రాత పోషించారు. చెరుకుపల్లి మండలంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, బరులు సిద్ధం అయ్యాయంటూ ‘సాక్షి’  ప్రచురించిన కథనానికి స్పందించిన పోలీసులు చెరుకుపల్లి మండలానికి 100 మంది పోలీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కానీ సంక్రాంతి మూడు రోజులపాటు జూద క్రీడలు జరుగుతున్నా..అధికార పార్టీ నేతల అండ ఉండడంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకున్నారు.   

పందేల కోసం పరుగులు
తాడేపల్లి రూరల్‌: సంక్రాంతి సందర్భంగా సోమ, మంగళవారాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి సుమారు 4 వేల నుంచి 5 వేల మంది పందెం రాయుళ్లు కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు తరలివెళ్లారు. కుంచనపల్లి గ్రామంలో ఏకంగా 300 మంది వరకు పయనమయ్యారు. ఒకే వ్యక్తి 8 కోడిపుంజులను తీసుకెళ్లగా 7 పుంజులు పందెం గెలుపొందడం, అదే గ్రామానికి చెందిన ఒకే పుంజు 7 పందేలను కొట్టడంతో గ్రామంలో ఉత్సవాలు చేశారు. ఉండవల్లి నుంచి గ్రామం నుంచి కూడా పందేల నిర్వహణకు భారీగా ఏలూరు తరలివెళ్లారు. వివిధ ప్రాంతాల్లో కోడి పుంజులతో బరుల్లో ఫొటోలు దిగి వాట్సప్‌ల్లోనూ, ఫేస్‌బుక్‌లలోనూ అప్‌డేట్‌ చేశారు. కొందరు పేకాటరాయుళ్లు జేబులు ఖా చేయించుకుని వచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక, ఉండవల్లి, కుంచనపల్లి, పాతూరు, కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం, మెల్లెంపూడి, ఆత్మకూరు, నిడమర్రు, యర్రబాలెం, నూతక్కి డొంక, రామచంద్రాపురం, శృంగారపురం, తదితర గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు. పోలీసులకు సమాచారం వచ్చేలోగా వీరు అప్రమత్తమై తప్పించుకున్నారు.

డమ్మీలతో కనికట్టు చేద్దాం...!
పండుగ సందడి ముగింపునకు రావడంతో కిక్కు దిగుతోంది. సుప్రీంకోర్టు ఆగ్రహిస్తుందేమోనని అటు నిర్వాహకులు ఇటు పోలీసులు సందేహిస్తున్నారు. ఎవరైనా ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలను కాపాడే కనికట్టుకు పోలీసులు తెరతీశారు. ఆ పథకం ప్రకారం... పోలీసు అధికారులు తూతూ మంత్రంగా కొన్ని కేసులు కడతారు. అందుకు టీడీపీ నేతలే తమ అనుచరుల్లో కొందరి పేర్లను చెబుతారు. అమరావతి పరిధిలో వేళ్లపై లెక్కపెట్టినన్ని కేసులు కడతారు. స్టేషన్‌ బెయిల్‌ మీదే విడిచిపెడతారు. మునుముందు సుప్రీంకోర్టుగానీ దీనిపై ప్రశ్నిస్తే... తాము బరుల మీద దాడులు చేశామని... నిర్వాహకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని చూపిస్తారు. లేకపోతే లేదు. కొన్ని రోజులకు ఆ కేసులు వీగిపోయినట్టో... నామమాత్రపు జరిమానాలతో సరిపుచ్చినట్టో చూపిస్తారు. తద్వారా రూ.వెయ్యికోట్లు మేర సాగిన దందాకు రక్షాకవచం ఏర్పాటు చేస్తారు. దందా నిర్వాహకులైన టీడీపీ ప్రజాప్రతినిధులు, దానికి సహకరించిన అధికారులకు ఎలాంటి ఇబ్బందిరాకుండా ముందస్తు వ్యూహమన్న మాట. విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ తతంగాన్ని దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ శివార్లలో కొన్ని పోలీస్‌స్టేషన్లలో కొందరు పేర్లను నమోదు చేసుకున్నారు. రానున్న రెండ్రోజుల్లో అమరావతి పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఇలాంటి తూతూ మంత్రం కేసులు నమోదు చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement