యనమలకుదురు లంకలో కోడి పందెం
విజయవాడ: సంక్రాతి పండుగకు నెల రోజుల ముందే జిల్లాలో కోడిపందేల జోరు మొదలైంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల కాదు, జిల్లా వ్యాప్తంగా బరులు గీసి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. కోడిపందేలకు అనుమతులు ఇవ్వాలని పోలీసు అధికారులపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచారు. దీంతో పోలీసులు పచ్చజెండా ఊపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలవొగ్గిన పోలీసు ఉన్నతాధికారులు కోడిపందేల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాలని కింది స్థాయి సిబ్బందికి సూచించారన్న ప్రచారం సాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు కోడిపందేలకు ఎక్కడికక్కడ రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో టీడీపీ నాయకుల అండదండలతో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కమిషరేట్ పరిధిలో పెనమలూరు సమీపంలో యనమలకుదురు లంకల్లో ఆదివారం పెద్ద ఎత్తున సాగిన కోడిపందేలు నిర్వహించారు. ఈ ఒక్క రోజే రూ.లక్షల్లో చేతులు మారాయని తెలిసింది. నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత అనుచరగణం 15 రోజులుగా లంకల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
కృష్ణా నది పరీవాహక ప్రంతంలోని యనమలకుదురు, పెదపులిపాక, సమీప లంకల్లో పందేల సందడి ఊపందుకుంది. శని, ఆదివారం రోజుల్లో జోరుగా పందేలు సాగుతున్నాయి. విజయవాడ– ఆగిరపల్లి రహదారిలోనూ కోడి పందేల బరులు భారీగా ఏర్పాటయ్యాయి. నున్న మామిడితోటల్లో పందేలు సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మైలవరం, తిరువూరు, గన్నవరం, మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, నందిగామ ప్రాంతాల్లో ఇప్పటికే కోడిపందేలు సాగుతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. కృష్ణానది కరకట్ట పొడవునా మాటుగా ఉండే ప్రాంతాల్లో కోడిపందేలు వేస్తున్నారు.
పోలీసుల పేరుతో దందా
జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసుల అనుమతుల పేరుతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల నుంచి అనుమతులు తెచ్చామని పెనమలూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు డబ్బు వసూలు చేస్తున్నారు. ఆదివారం ఒక రోజుకు పోలీసు స్టేషన్‌కు రూ.10 వేలు చెల్లించాలని పందెంరాయుళ్ల నుంచి టీడీపీ నేతలు డబ్బువసూలు చేశారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment