సంక్రాంతి వచ్చిందంటే పందెంరాయుళ్లకు పండగే. కోడి, పొట్టేళ్ల పందాలకు రెడీ అయిపోతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అయితే ఈ పందాలు రూ. కోట్లలో జరుగుతాయి. ప్రజాప్రతినిధులు, పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో నోట్ల కట్టలతో బరులు వద్ద వాలిపోతుంటారు. ఈ స్థాయిలో కాకపోయినా శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా పందాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వీరఘట్టం మండల సరిహద్దు ప్రాంతాల్లోని తోటల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పందాలను గుట్టుగా జోరుగా నిర్వహిస్తూ పందెంరాయుళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీకాకుళం, వీరఘట్టం: జిల్లాలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా పందెంరాయుళ్లు కోడి, పొట్టేళ్ల పందాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ పోటీలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరఘట్టం మండలంలోని సరిహద్దు ప్రాంతాలు ఈ పందాలకు అనువుగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావివలస–వీరఘట్టం మండలంలోని కంబర సరిహద్దు మామిడి తోటలు, పాలమెట్ట(పి.వి.ఆర్.పురం) నాగావళి నదీతీర ప్రాంతం, పనసనందివాడ–తలవరం సరిహద్దు మామిడి తోటల్లో, హుస్సేనుపురం మామిడి తోటల్లో ఎక్కువగా ఈ పందాలు నిర్వహించనున్నట్టు సమాచారం.
పోలీసులు దాడులు చేసేటప్పుడు తప్పించుకునేందుకు ఈ సరిహద్దు ప్రాంతాలు అనువుగా ఉండడం, అలాగే పోలీసులు వస్తున్న సమాచారం ముందుగా తెలుసుకునేందుకు వెసులుబాటు ఉండడం తదితర కారణాలతో ఇటువంటి ప్రదేశాల్లో ఈ పందాలను నిర్వహిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. గత నెల 29న పాలమెట్ట తోటలో పెద్ద ఎత్తున జరిగిన పొట్టేళ్ల పందాలపై పోలీసులు దాడులు చేసి పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పదుల సంఖ్యలో పందెంరాయుళ్లు పాల్గొనగా కేవలం 8 మంది మాత్రమే పట్టుబడినట్లు పోలీసులు చెబుతున్నారు.
తెల్లవారుజామునే...
కోడి, పొట్టేళ్ల పందాలు ఎక్కువగా తెల్లవారుజామున నిర్వహిస్తుంటారు. వీరఘట్టం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, వంగర, రేగిడి, పాలకొండ మండలాల నుంచి అధికంగా పందెంరాయుళ్లు ఈ పందాలలో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు ఉద్యోగులు కూడా గతంలో జరిగిన పందాలలో పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పోలీసులతో వీరికున్న పరిచయాలు వల్ల మళ్లీ మళ్లీ పాల్గొంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ పోటీలు సందర్భంగా రూ. లక్షల్లో చేతులు మారనున్నాయి.
వాహనాలు సీజ్ చేస్తే ఆగుతాయి
పోలీసుల దాడుల్లో వాహనాలు, మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రి దొరుకుతున్నప్పటికీ వాటిని పట్టుబడినట్టు రికార్డులో చూపకపోవడంతో పందాలు జోరందుకుంటున్నాయి. వాహనాలను సీజ్ చేసి, మొబైల్స్‌లోని కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడితే అందరినీ అదుపులోకి తీసుకోవచ్చును. అయితే ఆ తరహాలో పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం, వాహనాలను వెంటనే వదిలేయడంతో ఇంతే కదా అంటూ పందెంరాయుళ్లు బరితెగిస్తున్నారు.
పోస్టర్లు విడుదల
సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా కోడి, పొట్టేళ్ల పందాలు నిర్వహిస్తే శిక్షార్హులంటూ వీరఘట్టం పోలీసులు మంగళవారం పోస్టర్లు విడుదల చేశారు. గతంలో పందాలు ఆడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు.
సుప్రీం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి
కోడి, పొట్టేళ్ల పందాల నిర్వాహకులపై కఠినమైన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. పాలకొండ డివిజన్‌లో ఎక్కువగా వీరఘట్టం మండల ప్రాంతాల్లోనే ఈ పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలపై నిఘా వేశాం. అందుకు ప్రత్యేక బలగాలను సిద్ధం చేశాం. – జి.స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ డివిజన్
Comments
Please login to add a commentAdd a comment