సాక్షి, భామిని: సంక్రాంతికి కొత్త దుస్తులు కొనలేదని వివాహిత, కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు మండలంలోని నేరడి–బి, బత్తిలి గ్రామాల్లో విషాదం నింపాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నేరడి–బికి చెందిన వివాహిత మునగవలస వాహిణి (28) శనివారం రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. అర్ధ రాత్రి వేళ ఇంట్లో పడి ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు భామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సంక్రాంతికి కొత్త దుస్తులు కొనలేదని భర్త అప్పన్నతో తగాదాపడి మనస్థాపంతోనే పురుగు మందు తాగిందని మృతురాలి తండ్రి సరిసాబద్ర లచ్చయ్య పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్‌ఐ కరణం వెంకటసురేష్ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.
బత్తిలిలో విషాదం..
బత్తిలిలో ఏడో తరగతి చదువుతున్న ఒడిశాకు చెందిన కుంబిరిక కావేరి (12) కడుపునొప్పి తాళలేక శనివారం రాత్రి పురుగు మందు తాగింది. చిన్నప్పటి నుంచి బియ్యం తినడం అలవాటు ఉంది. బియ్యం తినడంతో కడుపు నొప్పికి గురైందని పోలీసులు తెలిపారు. సమీపంలోని ఒడిశా జగన్నాథపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయఘడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఒడిశాలోని విక్రాంపురం గ్రామానికి చెందిన కావేరి బత్తిలిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుతోంది. మృతురాలి తండ్రి కుంబిరిక ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బత్తిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment