ఇంటి ముందు రంగవల్లి ఉండడం అందమే.. కానీ దాని ముందు బసవన్న నిలుచుంటే అదీ కళ. ఆడబిడ్డ పుట్టింటికి రావడం ఆనందమే.. అంతకుముందు బసవన్న గడపలో అడుగు పెడితే ఆ సంబరానికో పరిపూర్ణత. ధనుర్మాసపు వేకువలన్నీ తిరుప్పావై ప్రవచనాలవే.. వాటి మధ్యలో ఓ నాదస్వరం గుమ్మం మీదుగా చెవిని తాకితే అదీ పండగ సీజన్‌కు అసలైన సూచిక. మకర సంక్రాంతి పూట పూర్వీకులకు నైవేద్య సమర్పణ ఆనవాయితీనే.. కానీ ఇంటి ముందు ఓ పెద్దాయన వారి పేర్లను వీధంతా వినబడేలా లయబద్ధంగా పాడితే అదీ అసలైన నివాళి. ఇలా గంగిరెద్దుల వారు సిక్కోలు బతుకులో భాగం. దశాబ్దాలుగా అరుదైన కళను పరిరక్షిస్తున్నారు. అలాంటి వారు నివాసం ఉండే ఊరు భైరిసారంగపురం.
మందస: ఒకటి కాదు రెండు కాదు మందసకు రెండు వందల కిలోమీటర్ల అవతల.. సింహాద్రి అప్పన్న కొలువైన కొండ కింద ఊళ్లలోని మనుషులు వారు. గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు. వాటిని ఆడించగల సమర్థులు. అనాదిగా సంచార జీవులు కావడంతో ఓ శాశ్వత చిరునామా కోసం వెతుకుతుంటే వారికి దొరికిన ఒకానొక ఊరు మందస మండలంలోని భైరి సారంగపురం. అరవై ఏళ్ల కిందట వలస వచ్చి గుడిసెలు వేసుకుని బతుకులు ప్రారంభించిన ఆ కళాకారులు ఇప్పుడు సిక్కోలు కళాజీవన స్రవంతిలో ఓ భాగం. అరుదైన, అంతరించిపోతున్న గంగిరెద్దుల కళలను బతికిస్తున్న ఈ గంగిరెద్దుల వారు సంక్రాంతి సీజన్‌లో ప్రతి ఇంటికీ వచ్చే అతిథులు. గంగిరెద్దులకు శిక్షణ ఇవ్వడం, వాటిని ఊరూరా తిప్పడం చాలా ఆసక్తికరం. రానురాను ఈ కుటుంబాల వారు ఉద్యోగం, ఉపాధి వైపు వెళ్లిపోవడంతో ఇప్పుడు కొందరే మిగిలారు. వారే ఇప్పుడు ఈ కళను బతికిస్తున్నారు.
ఆరు నెలల శిక్షణ..
► గ్రామాల్లో భక్తులు సింహాద్రి అప్పన్నను మొక్కుకుని తమ పశువుల శాలలో పుట్టిన దూడలను కానీ లేదంటే కొనుగోలు చేసి గానీ ఈ గంగిరెద్దుల వారికి అందజేస్తారు.
►వీరు ఆ మూగజీవాలను బాగా మచ్చిక చేసుకుని ఎంతో శ్రమించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తాము చెప్పినట్లు వినేలా సిద్ధం చేస్తారు.
►తౌడు, ఉలవలు, నువ్వులు, తెలగపిండి, పెసర, మినుము పొట్టు తదితర వాటితో దాణా ఇచ్చి, ముందుగా ఒక ఏడాది పాటు ప్రతి రోజూ శిక్షణ ఇస్తారు.
►సంక్రాంతి మూడు రోజుల పాటు తమకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్ర కారం సన్నాయి, డోలు, గంగిరెద్దులను చక్కగా అలంకరించి, గ్రామాల్లోని ఇంటింటికీ తిరుగుతారు. గ్రామస్తులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. అదేవిధంగా గంగిరెద్దులతో వివిధ విన్యాసాలు చేయిస్తారు.
► గ్రామాల్లో గంగిరెద్దుల వారికి ధాన్యం, బియ్యం, డబ్బును అందిస్తారు. వస్త్రాలు కూడా కొంతమంది సమర్పిస్తారు.
► మరణించిన తమ పెద్దల ఆత్మలకు శాంతి కలగాలని ‘భత్యం’ అందిస్తే గంగిరెద్దుల కులస్తులు పెద్దల పేరున పొగుడుతారు.
కొందరే మిగిలారు..
జిల్లాలో సుమారు 250 మంది వరకు గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. భైరిసారంగపురం, చింతాడ, చిన్నదూగాం, పెంటిభద్ర, జగన్నాథపురం, గుండుబెల్లిపేట, కొన్నానపేట తదితర గ్రామాల్లో ఎక్కువగా ఈ కులస్తులు ఉన్నారు. భైరిసారంగపురంలో ప్రస్తుతం సూరయ్య, పోలయ్య, విశ్వనాథం తదితరులు గంగిరెద్దులతో విన్యాసాలను ఎంతో చక్కగా చేయిస్తున్నారు. ‘అల వైకుంఠపురం’ సినిమాలో ‘సిత్తరాల సిరపడు..’ పాట పాడిన బాడ సూరన్నది కూడా ఇదే వృత్తి. ధనుర్మాసం ప్రారంభం నుంచి గంగిరెద్దులతో గ్రామాల్లో తిరిగే వీరంతా ముఠాకు వెళ్లి గంథం అమావాస్య(ఏప్రిల్) సింహ్రాది అప్పన్న ఉత్సవాలకు తిరిగి వస్తారు. నాలుగు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తారు. ఏటా కార్తీక మాసంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు.
ఆదరణ తగ్గుతోంది..
గంగిరెద్దుల కళకు ఆదరణ తగ్గుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఎద్దులకు శిక్షణ ఇస్తాం. మిగిలిన ఆరు నెలలు గంగిరెద్దులను తీసుకుని ఊళ్లకు వెళ్తాం. ఇదే మాకు కులవృత్తి. గతంలో ఈ వృత్తిని నమ్ముకుని 120 కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం 30 కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని నమ్ముకున్నాయి.
– యడ్ల విశ్వనాథం, జిల్లా ఉపాధ్యక్షుడు, గంగిరెద్దుల కుల సంక్షేమ సంఘం
కళాకారులుగా గుర్తించాలి..
కులవృత్తినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నాం. గంగిరెద్దుల విన్యాసాలకు ప్రాధాన్యత తగ్గుతోంది. మాలో నిరక్ష్యరాస్యులే ఎక్కువ. కళాకారులుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి.
– బాడ సూరన్న, జానపద కళాకారుడు, భైరిసారంగపురం
శ్రమతో కూడిన శిక్షణ..
ఎద్దులను ప్రత్యేకంగా అలంకరిస్తాం. వీటికి ముందుగా ఏడాది పాటు శిక్షణ ఇచ్చి, తర్వాత కూడా శిక్షణ కొనసాగిస్తాం. బసవన్న పోషణకు వారానికి రూ.500 నుంచి రూ.600 వరకు ఖర్చవుతుంది.
– వై.పోలయ్య, భైరిసారంగపురం
Comments
Please login to add a commentAdd a comment