
టీడీపీ నాయకులదే హడావుడి
కత్తులు కట్టవద్దని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీవ్ర హెచ్చరికలు చేసినా వెలగపూడి బ్యాచ్ ఏమాత్రం తగ్గలేదు. కత్తి పందేలు రూ.లక్ష నుంచి గరిష్టంగా రెండు మూడు లక్షల రూపాయల వరకు జరిగాయి. డింకీ పందాలు రూ.50వేల నుంచి రూ.80 వేల జరిగాయి. ఇక్కడ గుండాట కోసం వేలం పాటలు నిర్వహించగా... ఓ టీడీపీ నేత రూ. 7.5లక్షలకు మూడు రోజులకు బోర్డు పాడుకున్న విషయం తెలిసిందే. కాగా శనివారం రాత్రి పందెం బరి వద్ద అనధికారిక మద్యం దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు.. పందేలకు వచ్చే వాహనదారుల నుంచి ఆశీలు వసూలు చేసుకునేందుకు టీడీపీకి చెందిన మరో నేత రూ.15లక్షలకు పాడుకున్నారు. మూడ్రోజులు ఇక్కడ మద్యం అమ్ముకునేందుకు ఎమ్మెల్యే అనుమతితో ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.
భారీ డ్రమ్ముల్లో చీప్ లిక్కర్, ఇతర ఖరీదైన మద్యం బాటిళ్లను నిల్వ చేశారు. ఓ వైపు పందేలు... మరో వైపు తాగినోళ్లకు తాగినంత అన్నట్టుగా తయారైంది. బిర్యానీ ప్యాకెట్ రూ.100లకు అమ్మగా.. మద్యం బాటిళ్లు రెట్టింపు ధరలకు విక్రయించారు. ఇక్కడ కోడిపందేలు నిర్వహించాలంటే నిర్వాహకులు ఏటా ముందుగా ఎమ్మెల్యేకి రూ.15లక్షల కమిషన్ చెల్లించాల్సి వుంటుందని విశ్వసనీయంగా తెలిసింది.
సాక్షి, విశాఖపట్నం: హైకోర్టు ఆదేశాలు పనిచేయలేదు. అధికారుల ఆంక్షలు లెక్క చేయలేదు. పందేల నియంత్రణకు పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్ లేకుండా పోయాయి. అధికార, ధనబలం ముందు ఖాకీలు తలవంచారు. పందేనిదే పై చేయి అయ్యింది. ఫలితంగా సంక్రాంతి పండుగ తొలిరోజునే కోడి బరిలో నిలిచింది. పందెం రాయుళ్లను గెలిపించింది.
అడ్డుకట్ట వేసినా... ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు ఏమాత్రం తగ్గలేదు. అధికార పార్టీ నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి కోడిపందేలకు సై అంటే సై అన్నారు. తొడగొట్టి బరిలో నిలిచారు. ఎప్పటిలాగే మారుమూల గ్రామాల్లో సరదాగా పందేలాడుకునే వారిపై ప్రతాపం చూపే పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరిగిన పందేల దరిదాపుల్లోకి రాలేదు. పండుగ తొలిరోజే కోట్లల్లో పందేలు జరిగాయి. ఈ శిబిరాల వద్ద గుండాటలు, పేకాట శిబిరాలు ప్రారంభించారు. పందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం ఏరులై పారింది. తొలిరోజే ఐదారు కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్టుగా చెబుతున్నారు.
పంతం నెగ్గించుకున్న వెలగపూడి
సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆరిలోవ బరిలో కోడిపందేలు అట్టహాసంగా మొదలయ్యాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్వయంగా పందేలను ప్రారంభించారు. బరిలో కూర్చొని మరీ ఆయన పందేలు ఆడించారు. స్వయంగా పందేలు కాశారు. వెలగపూడి యువసేన అధ్యక్షుడు కంచర్ల సందీప్‌తో పాటు 12 మందిని అరెస్ట్ చేయడం... ఆరిలోవ సమీప సెంట్రల్ జైలు దరి రామకృష్ణాపురం వద్ద గడిచిన మూడ్రోజులుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో ఈ సారి పందేలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. శనివారం అర్థరాత్రి వరకు బరి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ తెల్లారేసరికి మాయమైపోయింది. బరి దరిదాపుల్లో ఖాకీ అనే వాడే కన్పించలేదు. అర్థరాత్రి నుంచే కోలాహలం మొదలైంది. తెల్లారేసరికి విశాఖ సిటీతో పాటు విజయనగరం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు ఆరిలోవ బరికి పోటెత్తారు. వేలాది వాహనాలతో ఆరిలోవ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే వెలగపూడితో పాటు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ బరిలో
దిగి జోరుగా పందాలు కాశారు. వందలాది కోళ్లు ఇక్కడ బరిలో కాలుదువ్వాయి. తొలిరోజే కోట్లు చేతులు మారాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కానరాని సందడి
సిటీతో పోల్చుకుంటే గ్రామీణ జిల్లాలో కోడిపందాల సందడి తొలిరోజు పెద్దగా కన్పించలేదు. పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పందేలు ఆదివారం మధ్యాహ్నం నుంచి మొదలయ్యాయి. కాగా నర్సీపట్నం, యలమంచలి నియోజకవర్గాల్లో మాత్రం మారుమూల గ్రామాల్లో తప్ప పెద్దగా పందేల జాడ కన్పించలేదు. తీర మండలాల్లోని మట్టిదిబ్బలు, మామిడి, జీడి మామిడి తోటల్లో, పోలవరం కాలువ గట్లపైన పందేల సందడి కన్పించింది. కానీ గుండాటలు, పేకాట శిబిరాలు మాత్రం పెద్ద ఎత్తునే ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment