విస్తుపోతున్న ప్రజానీకం
నాడు ఇంటింటికీ రేషన్ ఇస్తే.. నేడు లిక్కర్ సరఫరా చేస్తున్నారని మండిపాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇక మద్యం తాగేందుకు వైన్‌షాపునకు రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరఫరా చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా మద్యం వ్యాపారులు ప్రచారానికి తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతంలోని ఓ వైన్‌షాపు నిర్వహకుడు ఈ రకంగా పోస్టులు పెట్టడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఘోరం అంటూ పలువురు మండిపడుతున్నారు. సూపర్‌సిక్స్, అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ చేసేందుకు బరితెగిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటికే రేషన్ ఇస్తే.. ఇప్పుడేమో..
ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాహనాల ద్వారా ఇంటికే రేషన్ సరఫరా చేశారని, నేడు కూటమి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. మద్యం డోర్ డెలివరీ చేయడమే అభివృద్ధా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాయకులు జేబులు నింపుకొనే పనిలో ఉన్నారే కానీ ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇంటికి మద్యం సరఫరా చేయడం కాదన్నారు. గత ప్రభుత్వంలా గుమ్మం వద్దకే పాలనను తీసుకెళ్లాలని, ఇంటి ముంగిటే సంక్షేమ పథకాలు అందించాలని హితవు పలుకుతున్నారు.
ఎమ్మెల్యే అండతోనేనా..
మద్యం హోం డెలివరీ చేసే వారికి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అండతోనే పబ్లిక్‌గా ప్రచారం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మద్యం సిండికేట్‌లు సైతం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయా? అనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాలో అంటున్నారు. దోచుకో.. దాచుకో.. పంచుకో.. అనేలా కూటమి పాలన సాగిస్తోందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment