కిక్కే.. కిక్కు | Chandrababu has brought huge profits to the TDP liquor batch | Sakshi
Sakshi News home page

కిక్కే.. కిక్కు

Published Thu, Jan 2 2025 5:12 AM | Last Updated on Thu, Jan 2 2025 10:19 AM

Chandrababu has brought huge profits to the TDP liquor batch

కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం 

రెండు రోజుల్లోనే రూ.331.84 కోట్ల అమ్మకాలు 

4.08 లక్షల లిక్కర్, 1.61 లక్షల బీరు కేసుల విక్రయం 

టీడీపీ లిక్కర్‌ సిండికేట్‌కు డబ్బే డబ్బు 

చంద్రబాబు మార్కు సంపద సృష్టి ఇదే..!  

సాక్షి, అమరావతి: ‘సంపద సృష్టిస్తా’ అంటూ ఘనంగా చెప్పే సీఎం చంద్రబాబు... తాను సృష్టిస్తున్న సంపదేమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. రాష్ట్రంలో మందుబాబులతో రెండు రోజులపాటు ఫుల్లుగా తాగించారు.

డిసెంబర్‌ 30, 31 తేదీల్లోనే ఏకంగా రూ.331.84 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి లిక్కర్‌ సిండికేట్‌ దుకాణాలకు తరలిపోయి, మందుబాబులకు చేరింది. తద్వారా టీడీపీ మద్యం మాఫియాకు చంద్రబాబు భారీ లాభాలు తెచ్చిపెట్టారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మార్కు సంపద సృష్టికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ముందుగానే తరలిన మద్యం
కొత్త సంవత్సరం వేడుకల పేరిట భారీగా విక్రయించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి భారీగా మద్యాన్ని రాష్ట్రంలోని 26 డిపోలకు, అక్కడి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలకు తరలించారు. 

కొత్త సంవత్సర వేడుకలు మొదలవడానికి ఒక రోజు ముందు అంటే డిసెంబర్‌ 30న ఏకంగా రూ.219 కోట్ల విలువైన మద్యం లిక్కర్‌ షాపులకు చేరింది. ఆ నిల్వలు సరిపోవని భావించిన ప్రభుత్వం డిసెంబర్‌ 31న మరో రూ.112 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు తరలించింది. తద్వారా  రెండు రోజుల్లోనే రూ.331.84కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించింది.

టీడీపీ మద్యం సిండికేట్‌కు డబ్బే డబ్బు
కొత్త సంవత్సరం వేడుకల పేరిట రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్‌కు డబ్బుల పంట పండింది. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సహకరించడంతో అడ్డూ అదుపు లేకండా మద్యం విక్రయాలు సాగించింది. ప్రభుత్వ ఉద్దేశం గుర్తించిన అధికారులు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోలేదు. 

దాంతో టీడీపీ లిక్కర్‌ సిండికేట్‌ ఏకపక్షంగా గుప్పిట పట్టిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు ఒక్కో షాపు పరిధిలో దాదాపు 10 బెల్ట్‌ దుకాణాల ద్వారా యథేచ్ఛగా మద్యం విక్రయించింది. అధికారికంగా రూ.331.84 కోట్ల విలువైన మద్యం విక్రయించగా.. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే రూ.10  నుంచి రూ.25 వరకు అధికంగా విక్రయించినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement