
భవానీపురం: నగరం నడిబొడ్డున కత్తి కట్టి మరీ కోడి పందేలు నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా ఇళ్ల మధ్యే ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో రాత్రి వేళ సైతం పందేలు నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు తీరుతో న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ అపహాస్యంపాలయ్యాయని పలువురు విమర్శించారు. శనివారం వరకు కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవంటూ హడావుడి చేసిన పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆదివారం చేతులెత్తేసి స్టేషన్లకు, కార్యాలయాలకే పరిమితమయ్యారు.
65వ నంబర్ జాతీయ రహదారి పక్కన భవానీపురం అవుట్ ఏజెన్సీ వద్ద ఉన్న మూడెకరాల ప్రైవేట్ స్థలంలో కోడి పందేలు నిర్వహించేందుకు టీడీపీ నాయకులు వారం మందుగానే ఏర్పాట్లు ప్రారంభించారు. పెద్ద బరి, చిన్న బరి ఏర్పాటు చేయడంతోపాటు పేకాడేందుకు టెంట్‌లు భారీగానే వేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ పందేలు నిర్వహించేందుకు వీలులేదని ఖరాకండిగా చెప్పడంతోపాటు భవానీపురం పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు పోలీసులు వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన 10 నిమిషాల్లోనే పందేల నిర్వాహకులు ప్రవేశించారు.
చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 గంటలకు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వచ్చి పందేలను ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్ద బరిలో ఫ్లడ్ లైట్లతో పందేలు కొనసాగాయి. చిన్నబరిలో చీకటి పడగానే నిలిపివేశారు. ఒక టెంట్‌లో చిన్న బజార్–పెద్ద బజార్ పేకాట జోరుగా సాగింది. ‘పిల్ల వచ్చింది’ పేరుతో మహేష్‌బాబు, సమంత, ప్రభాస్ చిత్రాలతో మరో బృందం పేకాట నిర్వహించింది. పికెట్ ఉపసంహరణపై పోలీసులను వివరణ అడగగా మధ్యాహ్నం నుంచి పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందోబస్తును ఉపసంహరించుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment