తూ.గోదావరి జిల్లా కొమరగిరిలో పందేలు
సాక్షి, నెట్‌వర్క్: తూర్పుగోదావరి జిల్లాలో జూదరాయుళ్లు చెలరేగిపోయారు. సుమారు 400 బరులకు పైగా ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నుంచి జూదప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ మూడు రోజులు రూ.800 కోట్లకుపైగా కోడి పందేలు జరిగాయని అంచనా. ఒకప్పుడు ఊరి పొలిమేరలకు, కొబ్బరి తోటలకు పరిమితమైన పందేలు ఇప్పుడు మెయిన్ రోడ్లకు దగ్గరగా బహిరంగంగానే సాగాయి. యు.కొత్తపల్లిలో అయితే పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే పందేలు జరిగాయి. డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలం ఆర్.బి.కొత్తూరులో పండుగ మూడు రోజులు రూ.5 కోట్ల మేర, పనసపాడు– తిమ్మాపురం సరిహద్దులో రూ.10 కోట్ల మేర, తుని నియోజకవర్గం తేటగుంటలో రూ.మూడు కోట్ల మేర పందేలు నడిచాయి.
జగ్గంపేట మండలం మర్రిపాకలో పందేలు చూసేందుకు వచ్చినవారి నుంచి రూ.300 చొప్పున నిర్వాహకులు వసూలు చేయడం గమనార్హం. పందేనికి కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించారు. కిర్లంపూడి, వేళంక, కాట్రేవుల పల్లెలో భారీ పందేలు జరిగాయి. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ సొంత గ్రామం పి.దొంతముర్రులో రూ.మూడు కోట్లు, ఇసుకపల్లి, పిఠాపురంలలో రూ.ఆరు కోట్ల మేర పందేలు సాగాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల మేర పందేలు జరిగాయని తెలుస్తోంది. అల్లవరం మండలం గోడి, గోడిలంక, అల్లవరం, రెళ్లుగడ్డ, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి, గొల్లవిల్లి, భీమనపల్లిలో అడ్డూ అదుపులేకుండా పందేలు జరిగాయి. కోడి పందేలకు తోడు పలుచోట్ల అశ్లీల నృత్యాలను నిర్వహించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో గొల్లవిల్లి, భీమనపల్లిలో అశ్లీల నృత్యాలను నిర్వహించడం గమనార్హం.
మినీ స్టేడియాలను తలపించిన బరులు
పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బరులతోపాటు వాటి పక్కనే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిశాయి. ఫలితంగా బరులు జాతరలను తలపించాయి. జిల్లాలో రూ.700 కోట్ల మేర పందేలు సాగాయి. కోడిపందేలు, పేకాటల్లో రూ.కోట్లు చేతులు మారితే గుండాట, కోతాటల్లో రూ.లక్షలు, రూ.వేలు చేతులు మారాయి. ఒక్కో కోడి పందెం కనీసం రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు సాగింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు మూడురోజులూ పందేలు జరిగే ప్రాంతాల వైపు రాకపోవడం గమనార్హం. బరుల వద్దే మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లాలో 30 వరకూ పెద్ద బరులు ఏర్పాటు చేయగా.. మరో 200 వరకూ చిన్న బరులు సిద్ధం చేశారు.
ఆయా ప్రాంతాల్లో మినీ స్టేడియాలను తలపించేలా భారీ షామియానాలు, వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన పందేలకు తెలంగాణ నుంచి కూడా జూదరులు భారీగా తరలివచ్చారు. లక్షల్లో పందేలు జరిగాయి. కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి కోతాట, గుండాట ఆడుతున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో సుమారు 45 బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో కోడిపందేల్లో భాగంగా జరిగిన కొట్లాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. నరసాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా కోడిపందేలు, పేకాట, గుండాట సాగాయి. నరసాపురం పట్టణంలో రోడ్డు పక్కన తోపుడుబళ్లపై పెట్టి మరీ గుండాట ఆడించారు. టీడీపీ నేతలు దగ్గరుండి నిర్వహించడంతో పోలీసులు కన్నెత్తి చూడలేదు. మార్టేరులో ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో 16 చోట్ల బరులు ఏర్పాటు చేశారు.
విజయవాడలో విచ్చలవిడిగా కోతముక్కాట
కృష్ణా జిల్లాలో రూ.500 కోట్ల మేర కోడి పందేలు సాగాయని అంచనా. జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే కోడిపందేలు, గుండాట, పేకాట జరిగాయి. కంకిపాడు, ముసునూరు, బాపులపాడు, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, మైలవరం, గన్నవరం, పామర్రు మండలాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా విజయవాడ నగరంలోని ప్రముఖ హోటళ్లలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కోతముక్కాట విచ్చలవిడిగా సాగింది. ఒక్కో కోసుకు రూ.లక్ష చొప్పున పందేలు జరిగాయి. సంక్రాంతి మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. గుంటూరు జిల్లాలో కూడా రూ.350 కోట్ల మేర కోడి పందేలను నిర్వహించినట్టు తెలుస్తోంది.
రేపల్లె రూరల్ మండలంలోని బొబ్బర్లంక, గుడ్డికాయలలంక, నిర్మల్ నగర్, చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, బలుసులపాలెం, నిజాంపట్నం మండలం అడవులదీవి, దిండి, కొత్తపాలెం, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెం పుష్కరఘాట్‌ల వద్ద అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో పందేలు సాగాయి. కోడి పందేలకు అనుబంధంగా గుండాట, కోతముక్క, చక్రం ఆటలు జరిగాయి. కొత్తబొమ్మువానిపాలెంలో తెనాలి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మరీ కోడిపందేలు నిర్వహించారు. గతేడాది కోడి పందేల కేసులు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెరవెనుకే ఉండి ఫోన్ ద్వారా అన్నీ తానై పర్యవేక్షించారు. విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా భీమిలి–విజయనగరం సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు సాగగా యలమంచలి, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలో మారుమూల ప్రాంతాల్లో పందేలు సాగాయి. జిల్లావ్యాప్తంగా రూ.80 కోట్ల మేర పందేలు కాశారు. విజయనగరం జిల్లాలో జూదంతోపాటు కోడి, పొట్టేలు పందేల కోసం రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు.
పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు
‘ఏం తమాషాగా ఉందా? కోళ్లు ఎలా పట్టుకెళతావు? కోళ్లకు కత్తులేమైనా కట్టామా? జూదమేమైనా ఆడిస్తున్నామా? మీరు వాంటెడ్‌గా చేస్తున్నారు.. చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు. పో... వెళ్లిపో.. మీ డీఎస్పీని రమ్మను’ అంటూ గుంతకల్లు టూటౌన్ ఏఎస్‌ఐ తిరుపాల్‌పై అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ చిందులు తొక్కారు. బుధవారం పాత గుంతకల్లు ఏరియా అంకాలమ్మ ఆలయ సమీపంలోని పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక టీడీపీ నేతలు కొందరు కోడి పందేలు నిర్వహించారు. ఈ సమాచారం టూటౌన్ పోలీసులకు చేరడంతో ఏఎస్‌ఐ తిరుపాల్, కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఇతర పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందేపు కోళ్లను స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అడ్డుకొని పోలీసు సిబ్బందిపై బూతు పురాణం అందుకున్నారు. ‘ఏం తమాషాలు చేస్తున్నారా? సంప్రదాయాలను కాపాడాల్సిందిపోయి అడ్డుకుంటారా?’ అంటూ కోపంతో ఊగిపోయారు. పోలీసుల నుంచి బలవంతంగా కోళ్లను తీసుకుని మళ్లీ పందేలు నిర్వహించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment