పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో కత్తికట్టి కొట్టుకుంటున్న కోళ్లు
సాక్షి, అమరావతి : కోర్టు ఓడిపోయింది. కోడే గెలిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి పండుగ రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు తరలిరావడంతో విజయవాడలోని హోటళ్లు, లాడ్జిలు రద్దీగా మారాయి.
బరిలో టీడీపీ ప్రముఖులు
అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు పందేలను ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో కోడి పందేలను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో పందేలను ఎమ్మెల్యే గన్నివీరాంజనేయులు ప్రారంభించారు. ఏలూరు నియోజకవర్గంలో జాలిపూడి, గుడివాకలంక, శ్రీపర్రు గ్రామాల్లో టీడీపీ నాయకులు కొత్త బరులు ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో పందేలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడే పొట్టేళ్ల పందేలు కూడా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో పందేలను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరంభించారు. గుంటూరుజిల్లా చెరుకుపల్లి మండలంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో బరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పందేలకు తెర తీశారు.
జిల్లాల్లో పందేల జోరు..
కోర్టు నిషేధం ఉన్నప్పటికీ ఈ ఏడాది భారీ స్థాయిలో బరులు ఏర్పాటుచేశారు. గత ఏడాది నిర్వహించిన ప్రాంతాలలో కాకుండా చాలా చోట్ల ఈ సారి కొత్త ప్రాంతాలలో బరులు ఏర్పాటు చేయడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వరకు కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా యత్నించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు మొదలయ్యాయి. యలమంచిలిలోని గుంపర్రులో పందేలను తిలకించేందుకు పలువురు సినీ కమెడియన్లు వచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో జాలిపూడి, గుడివాకలంక, శ్రీపర్రు గ్రామాల్లో టీడీపీ నాయకులు కొత్త బరులు ఏర్పాటు చేశారు. దెందులూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు జరుగుతున్నాయి.
భీమవరం నియోజకవర్గంలో వెంప, వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, మత్స్యపురి గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కొవ్వూరు, పాలకొల్లు, ఉండి, చింతలపూడి, ఆచంట, నరసాపురం, గోపాలపురం, తణుకు నియోజకవర్గాల్లో భారీగా పందేలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం గ్రామంలో 30 ఎకరాల భూమిలో భారీ స్థాయిలో బరి ఏర్పాటు చేసి పందేలు చేపట్టారు. కోడిపందేలతో పాటు గుండాట, కోత ముక్క వంటి జూదాలు కూడా నిర్వహించారు. డబ్బు బయటికి కనబడకుండా పందేల వద్ద కాయిన్ విధానం ప్రవేశపెట్టారు. తొలుత కత్తులు లేకుండా పోటీలు ప్రారంభించి.. అనంతరం కత్తులు కట్టి యథావిధిగా పందేలు నిర్వహించారు.
సెల్ ఫోన్లలో పందేల నిర్వహణను ఫొటోలు తీయకుండా నియంత్రించేందుకు దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తలను నియమించారు. విజయవాడ శివారు ప్రాంతంమైన పెనమలూరు నియోజకవర్గంలో ఈడ్పుగల్లు వద్ద భారీ బరిని నిర్వహించారు. ఇదే నియోజకవర్గంలో దాదాపు 10చోట్ల బహిరంగంగా బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడిపందేలు, గొర్రెపొట్టేళ్ల పందేలు, జూదం శిబిరాలు యథేచ్ఛగా నిర్వహించారు. ఈడ్పుగల్లులో జరిగిన పొట్టేళ్లు, కోడిపందేలకు హైదరాబాద్, తెలంగాణా, కర్ణాటక నుంచి గొర్రెపొట్టేళ్లు, కోళ్లతో పందెందారులు తరలివచ్చారు. కోస్తా జిల్లాల నుంచి కూడా కోడి పందెం దారులు తరలివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో గోడి, రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, లక్కవరం, రాజోలు, చింతలపల్లిలో జరిగాయి. ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో పందేలు జోరుగా సాగాయి.
కోట్లలో పందేలు
ఆదివారం భోగి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాటలలో దాదాపు రూ. 200 కోట్ల మేర డబ్బు చేతులు మారిందని వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ. 150కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రోజు రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ. 3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment