– శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.985 కోట్లు
– విలేకరుల సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు
అనంతపురం సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసిందని పంచాయతీరాజ్‌శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో గురువారం ఐటీశాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తాగు నీటి ఎద్దడిని తీర్చేందుకు రూ.4,500ల కోట్లు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నిధుల్లో అత్యధిక శాతం అనంతపురం జిల్లాకు కేటాయించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈక్రమంలోనే జిల్లాలో రూ.985 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.150 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో బోర్ల మరమ్మతులు, మోటార్లు, లీకేజీలు అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. గతేడాది తాగునీటి సరఫరా కోసం జిల్లాలో 500 వాహనాలను ఉపయోగించినట్లు తెలిపారు. బోర్ల నుంచి నీటిని కొనుగోలు చేసినందుకు అందుకు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.50 కోట్లు నిధులు జిల్లా కలెక్టర్ విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తున్నందున అందులో 20 శాతం నిధులు తాగునీటికి వినియోగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పంచాయతీల్లో శ్మశాన వాటికలు, అండర్ డ్రైనేజీల కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య ప్రతిసారి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కోసం ఓ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. చిత్రావతి, శ్రీరాంసాగర్, జేసీనాగిరెడ్డి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి ఉంటారన్నారు. సమావేశంలో ఎంఎల్‌సీ శమంతకమని, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, వరదాపురం సూరి, పార్థసారథితో పాటు జెడ్పీ సీఈఓ రామచంద్రయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరేరామ్‌నాయక్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవికుమార్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
'అనంత' దాహం తీరుస్తాం
Published Thu, Dec 29 2016 10:29 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement