పందేల జాతర | cock fight bettings in Eluru | Sakshi
Sakshi News home page

పందేల జాతర

Published Thu, Jan 16 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

పందేల జాతర

పందేల జాతర

సాక్షి ప్రతినిధి, ఏలూరు :కాళ్లకు కత్తులతో కోళ్లు కొట్లాడుకుంటున్నాయి. చుట్టూ వేలాదిగా చేరిన జనం కేరింతల కొడుతున్నారు. చేతిలో డబ్బు కట్టలు. పక్కనే పేకాట శిబిరాలు. మరోవైపు గుండాట బోర్డు లు. ఇంకోవైపు టెంట్లలో మద్యం అమ్మకాలు. బిర్యానీ నుంచి కోడి పకోడి వరకూ తినుబండారాల స్టాళ్లు.. వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు.. తిరునాళ్లను తలపించే రీతిలో కోడి పం దేలు సాగుతున్నాయి. జిల్లాలో మూడు రోజులుగా బరితెగించి మరీ పందేలు కడుతున్నారు. బరుల వద్ద ఇతర జూద క్రీడలకూ అంతు లేకుండాపోయింది. వినోదం పేరుతో గ్రామాల్లో అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న  జూదాల్లో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి ఉన్నత కుటుంబాలకు చెందినవారు, విద్యావంతులు సైతం సంప్రదాయం పేరుతో  పందేల్లో తలమునకలవుతున్నారు. జిల్లాలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా కోడి పందేలు సాగా. పందెం బరులు వేయని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఐ.భీమవరం, భీమవరం ఆశ్రం తోటల్లో ఎప్పటిమాదిరిగానే పందేలు తిరునాళ్లను తలపించాయి.
 
 ఈసారి ఆ రెండు ప్రాంతాలను తలదన్నేలా భీమవరం మండలం వెంపలో పందేలు నిర్వహించారు. పెదవేగి మండలం కొప్పాకలోనూ అదే స్థాయిలో పందేలు జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీగా పందేలు వేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లింగపాలెంలోనూ పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఇవికాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 40 నుంచి 50 ప్రాంతాల్లో పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేల బరుల వద్ద లక్షలాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి. రూ.500 మొదలుకుని రూ.50 లక్షల వరకూ పందేలు కాస్తున్నారు. రెండు లక్షలు పైబడి భారీస్థాయిలో జరిగే పందేల సుమారు పదికిపైగా జిల్లాలో జరిగాయి. అక్కడ ఒక్క పందెం విలువే రూ.30 నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. మిగిలినచోట్ల రూ.5 లక్షలు ఆ పైబడి ఉంటోంది.
 
 విచ్చలవిడిగా జూదం.. మద్యం..
 కోడి పందేలతోపాటు పేకాట, గుండాడ, కోతాట ఇతర జూదక్రీడలు బరుల వద్ద యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేల కంటే ఎక్కువగా ఈ క్రీడల వద్దే జనం ఉంటున్నారు. డబ్బు చెలామణి కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతోంది. కోడి పందేల మొత్తం కంటే ఈ జూదాల దగ్గర జరగే టర్నోవర్ రెట్టింపు మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు మద్యం అమ్మకాలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. బరుల వద్ద మినీ బార్లు వెలిశాయి. టెంట్‌లు వేసి మద్యం దుకాణాల మాదిరిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆ లోపలే బల్లలు వేసి బార్ల మాదిరిగా మద్యం సరఫరా చేస్తున్నారు. 
 
 ప్రముఖుల సందడి
 మరోవైపు ఈ పందేలు జరిగే చోట ప్రముఖుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. డెల్టాలో పందేలకు సినీ జనం తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ వంటివారు పందేలకు రావడం గమనార్హం. అలాగే చిన్న సినిమాల హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక మంది మంది బరుల వద్ద కనిపించారు. అన్నింటికీ మించి ఈసారి రాజకీయ నాయకుల హడావుడి కూడా ఎక్కువైంది. ఆయా ప్రాంతవాసులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. వారు కూడా పందేల్లో పాల్గొన్నారు. 
 
 పత్తాలేని పోలీసులు
 జిల్లా అంతటా మూడురోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొన్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూసినపాపాన పోలేదు. పండగకు ముందు రెండు రోజులపాటు హడావుడి చేసినా ఆ తర్వాత ఏ పోలీసు అధికారి నోరు మెదపలేదు. పోలీసులు కనీస విధులు కూడా నిర్వర్తించకపోవడంతో పందెగాళ్లు అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించారు. పందేల గురించి లోకాయుక్త హెచ్చరించినా పోలీసులు తమకు పట్టనట్టే వ్యవహరించారు. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎంత ఉన్నా పూర్తిగా పందేలరాయుళ్లను వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు భారీ ఎత్తున మామూళ్లు ముట్టిన విషయం బహిరంగ రహస్యంగానే ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement