అత్తింటివారితో హన్సిక; హన్సిక, సోహైల్; తల్లి, సోదరుడితో...
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు.
సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్‌లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతాం.
పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే...
సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది.
గ్రాండ్‌గా పండగ
లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు.
పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం
‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్‌లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది.
ఈ 20 నుంచి ఫుల్ బిజీ
పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్‌లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా
జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment