AP: సంబరంలా సంక్రాంతి | CM YS Jagan Sankranti celebrations at CM camp office | Sakshi
Sakshi News home page

AP: సంబరంలా సంక్రాంతి

Published Sun, Jan 15 2023 2:17 AM | Last Updated on Sun, Jan 15 2023 9:54 AM

CM YS Jagan Sankranti celebrations at CM camp office - Sakshi

హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు

సాక్షి, అమరావతి:  సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు నేత్రపర్వంగా జరిగాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సంద­ర్భంగా రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన, రాష్ట్రవ్యా­ప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలం­దరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి చిహ్నా­నికి గుర్తుగా తెల్లని పావురాలను ఎగురవేశారు. 
సీఎం జగన్‌ దంపతుల మాటామంతీ 

గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా.. 
అంతకుముందు.. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు, పాఠశాలల నాడు–నేడు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అసలుసిసలైన పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. 

ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా.. 
ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ జ్యోతి ప్రజ్వ­లన చేసి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. గోశాలలోని గోవులకు పూజచేసి దండలు వేసి వాటిని నిమిరుతూ కొద్దిసేపు సంతోషంగా అక్కడ గడిపిన అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించుకున్నారు. అక్కడి వినాయకుడి గుడిలోనూ పూజలు నిర్వహించారు.


అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన భోగిమంటను కాగడాతో వెలిగించారు. హరిదాసుకు బియ్యం పోయడంతోపాటు పండ్లు కూరగాయలతో కూడిన స్వయంపాకాన్ని సమర్పించారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాలలో సీఎం దంపతులు ఆశీనులయ్యారు. 

హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు   
 
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు 
ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్‌ నేతృత్వంలో  ఏర్పాటుచేసిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు ఆద్యంతం ఆస్వాదించారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్ల కట్టినట్లు చూపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతిరెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి పిలిపించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీర్ఘకాలం సీఎంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. అనంతరం.. శాంతి చిహ్నానికి ప్రతీకగా సీఎం దంపతులు తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న వివిధ కళాకారులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు.  

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement