సంక్రాంతి వచ్చిందంటే ప్రతి వాకిలి ముగ్గులతో మురిసిపోతుంది. తెల్లటి చుక్కలు మల్లెల్లా ఇంటిముందు వికసిస్తాయి. రంగులు పూసుకొని ముస్తాబవుతాయి. స్త్రీలు తెల్లవారుజాము నుంచి ఓపిగ్గా వీటిని తీర్చుదిద్దుతారు. నిలువు చుక్కలు, అడ్డ చుక్కల మధ్య మెలి తిరుగుతూ రేఖలు కదులుతాయి. ఈ ముగ్గుల వెనుక చాలా విశేషాలున్నాయి. శుభాలూ ఉన్నాయి. బోసి వాకిలిని ముగ్గుతో ఎందుకు కళను నింపాలో తెలుసుకుందాం.
సంవత్సరమంతా ఇంటి వాకిలి ముందు సుద్దముక్కతో అమ్మ గీసే ముగ్గు వేరు. సంక్రాంతి రాగానే వేసే ముగ్గు వేరు. సంక్రాంతి పండగ నెలంతా ఇంటిముందు పెద్ద ముగ్గులు పడతాయి. తెల్లగీతలతో ఒక్కోసారి, రంగులతో నిండి ఒక్కోసారి. పండగ నెల వస్తే వీధిలోని స్త్రీలంతా తెల్లవారు జామున లేచి ఇంటి ముందు పెద్ద ముగ్గును వేయడానికి ఇష్టపడతారు. కాని అది ఒక నిమిషంతో అయ్యేదా? వాకిలి చిమ్ముకోవాలి, కళ్లాపి చల్లుకోవాలి, తర్వాత చుక్కలు పెట్టాలి, చుక్కలు కలపాలి, రంగులు అద్దాలి.. యోగా అంటారు గాని ఇంతకు మించిన యోగా లేదు. ఇంతకు మించిన వ్యాయామమూ లేదు. ముగ్గు పెట్టాక ఇంటికి ఇంతకు మించిన కళ లేదు.
మనకు ఉంది... మరి క్రిమి కీటకాలకు?
సంక్రాంతికి పంట చేతికొస్తుంది. కొత్త బియ్యం ఇంట చేరుతాయి. గాదెలు నిండుతాయి. వడ్ల బస్తాలున్న ఇల్లు సమృద్ధిగా కనిపిస్తుంది. కాని పండించింది మనమే తింటే ఎలా? క్రిమి కీటకాదులకు? ముగ్గు ఒక పంపకం. ముగ్గు ఒక దానం. ముగ్గు ఒక సంతర్పణ. ఎందుకంటే ముగ్గును బియ్యం పిండితో వేస్తారు. బియ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు బియ్యం పిండితో పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కొదవేముంది? ఆ పిండి ముగ్గు వేస్తే ఆ పిండిని చీమలు, క్రిములు, కీటకాలు ఆరగిస్తాయి. అలా ప్రకృతిని సంతృప్తి పరిచిన ఇంటిని ప్రకృతి కాచుకుంటుంది. శుభం జరుగుతుంది.
ముగ్గు ఆడవాళ్ల సొంతం
భారతీయ సంస్కృతిలో హరప్పా, మొహెంజోదారో కాలం నాటి నుంచే అంటే క్రీ.పూ 2000 కాలం నుంచే ముగ్గులు ఉన్నట్టు ఆధారాలున్నాయి. తమిళనాడులో ముగ్గుకు విశేష ఆదరణ ఉంది. ఉత్తరాదిలో ముగ్గును ‘రంగోలి’ అంటారు. తెలుగువారి సంస్కృతిలో ముగ్గు ఉందనడానికి సాహిత్య తార్కాణాలున్నాయి. కాకతీయుల గాథను తెలిపే ‘క్రీడాభిరామం’లో ‘చందంబున గలయంపి చల్లినారు.. మ్రుగ్గులిడినారు’ అని ఒక పద్యంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్త మాల్యద’లో ‘బలువన్నె మ్రుగ్గుబెట్టి’ అని ఒక పద్యంలో రాశాడు. అయితే తొలి రోజుల్లో పురుషుల కళగా ఉన్న ముగ్గు క్రమేపి స్త్రీల కళగా మారింది.
స్త్రీని ఇంటి పట్టునే ఉంచడం వల్ల, వంటకు, పూజకు, భక్తి గీతాలకు మాత్రమే అనుమతించడం వల్ల, చాలాకాలం ఇతర లలిత కళలకు దూరంగా ఉంచడం వల్ల ‘ఎవరి కంట పడకుండా’ ఇంటి పట్టున సాధన చేసుకునే ముగ్గు మీద ఎవరికీ అభ్యంతరం లేక΄ోయింది. దాంతో స్త్రీలు తమ సృజనాత్మకతను ముగ్గుల్లో చూపారు. ముగ్గుల వల్ల కొద్దో గొప్పో లెక్కలు తెలియడం, ధ్యాస నిలవడం, వేసుకున్న ముగ్గును చూసి సంతృప్తి చెందడం ఆడవాళ్లకు వీలయ్యింది.
అంతేకాదు తెల్లవారు జామున స్త్రీలు లేచి వీధి మొత్తాన్ని పలకరించుకుంటూ మానవ సంబంధాలు పెంచుకునే వీలు చిక్కింది. కష్టసుఖాలు మాట్లాడుకునే వీలు కూడా. మనం వేసిన ముగ్గున మరుసటి రోజున మనమే చెరిపిపేయడంలో ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలన్న భావన, గతం గతః అనుకునే తాత్త్వికత ఏర్పడతాయి. ఇప్పటి కాలంలో కూడా ముగ్గుల్లో మగవాళ్లకు ప్రవేశం లేకపోవడం గమనార్హం.
రకరకాల ముగ్గులు
ముగ్గుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటి చుక్కలను బట్టి, రూ΄ాలను బట్టి ఆధ్యాత్మిక, ధార్మిక వ్యాఖ్యానాలు ఉంటాయి. తొమ్మిది చుక్కల ముగ్గు నవగ్రహాలకు ప్రతీక అని, చుక్కలు లేకుండా రెండు అడ్డగీతలు గీసి ఖండించుకునే త్రికోణాలతో వేసే ముగ్గు కుండలినికి గుర్తు అని అంటారు. అలాగే పురాణాలను తెలిపే, అవతారాలను సూచించే ముగ్గులు ఉంటాయి. రాను రాను ఈ ముగ్గులు సందేశాత్మకంగా కూడా మారాయి. దేశభక్తిని తెలిపే నాయకుల బొమ్మలు, జాతీయ పతాకాలు ముగ్గుల్లో చేరాయి. ఒక్కోసారి నిరసనలకు, నినాదాలకు కూడా వేదికలయ్యాయి.
ముగ్గు ప్రథమ లక్ష్యం పారిశుద్ధత. ఇంటిముంగిలిని శుభ్రం చేసుకుని వేస్తారు కాబట్టి ఆ రోజుల్లోకాని ఈ రోజుల్లోకాని సగం రోగకారకాలు ఇంట్లో రాకుండా ఉంటాయి. అయితే రాను రాను స్త్రీలు బద్దకించి ఆధునికత పేరుతో స్టిక్కర్ ముగ్గులతో సరి పెట్టడం కనిపిస్తోంది. చిటికెన వేళ్ల మధ్య ముగ్గు ఎంత ధారగా వేయడం వస్తుందో అంత నైపుణ్యం వచ్చినట్టు. ముగ్గు వేయడంలో నైపుణ్యం వస్తే జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కూడా నైపుణ్యం వస్తుంది. సంక్రాంతిని బ్రహ్మాండమైన ముగ్గులతో స్వాగతం చెపుదాం.
Comments
Please login to add a commentAdd a comment