దేవుళ్లకు పండగలు చేసుకోవడం ఎక్కడైనా మామూలే! దయ్యాల పండగ మాత్రం థాయ్‌లాండ్‌కు మాత్రమే ప్రత్యేకం. ఏటా జూన్ నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో జనాలు దయ్యాల బొమ్మలను చిత్రించిన ముసుగులను ధరించి, వీథుల్లోకి వచ్చి, సంప్రదాయ నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. దయ్యాల ముసుగులను వెదురుతోను, పలచని కలపతోను తయారు చేస్తారు. పెద్దపెద్ద ముక్కులు, చెవులతో తయారుచేసే ఈ ముసుగులు వినోదభరితంగా ఉంటాయి.
థాయ్‌లాండ్‌లోని లోయీ ప్రావిన్స్ డాన్‌సాయ్ పట్టణంలో ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ‘ఫి టా ఖోన్ ఘోస్ట్ ఫెస్టివల్’గా పిలుచుకునే ఈ మూడు రోజుల పండుగ మొత్తం కార్యక్రమాన్ని ‘బున్ లువాంగ్’ అంటారు. ఇందులో భాగంగా మున్ నది అవతారంగా భావించే బౌద్ధ సన్యాసి ఫ్రా ఉపాకుత్ ఆత్మశక్తిని ఆహ్వానించి, ప్రజల రక్షణ కోసం ప్రార్థనలు జరుపుతారు. ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు డాన్‌సాయ్ పట్టణంలో ఈ దయ్యాల పండగ సంప్రదాయ రీతిలో అట్టహాసంగా జరుగుతోంది.
‘ఫి టా ఖోన్’ పండగ నేపథ్యానికి సంబంధించిన గాథ బౌద్ధ జాతక కథల్లో ఉంది. దీనికి సంబంధించిన జాతక కథ ప్రకారం.. బుద్ధుడు తన ఒకానొక పూర్వ జన్మలో యువరాజుగా పుట్టాడట. ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకోవడానికి దేశాటనకు వెళ్లాడట. ఎన్నాళ్లు గడిచినా రాజధానికి తిరిగి రాకపోవడంతో అతడు మరణించి ఉంటాడని భావించిన రాజబంధువులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారట.
ఆ యువరాజు ఆత్మను ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకోవడం అప్పటి నుంచి సంప్రదాయంగా మారిందట. మొదటిరోజు దయ్యాల ముసుగులు ధరించి ఊరేగింపులు జరిపే వేషదారులు సందర్శకులను కట్టెలతో భయపెడుతుంటారు. రెండోరోజు తారాజువ్వలను ఎగరేస్తారు. మూడోరోజు స్థానిక బౌద్ధ ఆలయానికి చేరుకుంటారు. ముగింపు కార్యక్రమంలో ఆలయంలోని బౌద్ధ సన్యాసులు శాంతి ప్రార్థనలు చేస్తారు.
ఇవి చదవండి: పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!
Comments
Please login to add a commentAdd a comment