రబాత్: ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈత చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి, అరుదైన దృశ్యాలను మన కళ్లముందు ఉంచాయి.
ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తాయి. అయితే సెప్టెంబరులో ఈ ప్రాంతంలో వార్షిక సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని మొరాకో ప్రభుత్వం తెలిపింది. రాజధాని రబాత్‌కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాగౌనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మి.మీ. కంటే అధిక వర్షపాతం నమోదైంది.
విషయం తెలుసుకున్న పర్యాటకులు ఈ ఎడారి ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి తరలివస్తున్నారు. ఇక్కడి ఈత చెట్ల మధ్య ఏర్పడిన నీటి మడుగులను చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ వారు చెబుతున్నారు. గడచిన 50 సంవత్సరాలలో మొదటిసారిగా, ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటియోరాలజీకి చెందిన హుస్సేన్ యూఅబెబ్ తెలిపారు.
ఈ ప్రాంతంలో వరుసగా ఆరేళ్ల పాటు కరువు తాండవించింది. దీంతో రైతులు తమకున్న కాస్త పొలాలను బీడుగా వదిలివేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు ఎడారి దిగువన ఉన్న భూగర్భజలాల నిల్వలను తిరిగి నింపడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.
కాగా భారీ వర్షాల కారణంగా అల్జీరియాలో 20 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం అత్యవసర సహాయ నిధులను విడుదల చేయాల్సి వచ్చింది. జగోరా- టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ఇరికి సరస్సు నీటితో నిండుగా ఉండటాన్ని నాసా ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!
Comments
Please login to add a commentAdd a comment