World Largest Amazon Forest: Deforestation, Climate Changes And 15 Interesting Facts - Sakshi
Sakshi News home page

Amazon Rain Forest: ముప్పు ముంగిట అమెజాన్‌.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే!

Published Tue, Mar 15 2022 3:27 AM | Last Updated on Tue, Mar 15 2022 2:15 PM

Amazon Deforestation and Climate Change - Sakshi

అమెజాన్‌ వర్షారణ్యం మధ్యలో అటవీ నిర్మూలన

ఒకపక్క వాతావరణ మార్పులు, మరోపక్క అడవుల నరికివేతతో ప్రఖ్యాత అమెజాన్‌ వర్షారణ్యం (రెయిన్‌ ఫారెస్ట్‌) ఎండిపోతోంది. మానవ తప్పిదాల కారణంగా అమెజాన్‌ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు క్షీణిస్తున్నాయని, దీంతో ఇవి క్రమంగా అడవుల స్థాయి నుంచి సవన్నా (గడ్డి మైదానాలు)లుగా మారిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇదే నిజమైతే కేవలం అమెజాన్‌ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటిపై పెను ప్రభావం పడుతుందని తెలిపింది.

అమెజాన్‌ బేసిన్‌లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికిపైగా ఉంటుంది. ప్రపంచ కార్బన్‌డైఆక్సైడ్‌ (co2) స్థాయి నియంత్రణలో అమెజాన్‌ వర్షారణ్యానిది కీలకపాత్ర. అయితే ఈ అడవులు క్షీణించి సవన్నాలుగా మారితే  co2 నియంత్రణ బదులు  co2 వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వివరించారు. గతంలో ఊహించినదాని కన్నా వేగంగా ఈ అడవులు అంతర్ధానం అంచుకు చేరుతున్నాయన్నారు. 25 సంవత్సరాల శాటిలైట్‌ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తోందని నేచర్‌ క్లైమెట్‌ ఛేంజ్‌లో పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా చెట్ల నరికివేత, కరువు సంభవించిన ప్రాంతాల్లో తిరిగి అడవి కోలుకోవడం దాదాపు సగానికిపైగా తగ్గిందని అధ్యయన సహ రచయత టిమ్‌ లెంటాన్‌ చెప్పారు. మానవ తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెజాన్‌ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా కార్బన్‌ కాలుష్యాన్ని తగ్గించకపోతే శతాబ్ది మధ్యకు వచ్చేసరికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేశారు.

ప్రపంచానికే డేంజర్‌
ఇప్పటికే ధ్రువాల వద్ద మంచు కరగడం, వాతావరణంలో  co2 స్థాయిలు పెరగడం, దక్షిణాసియాలో అనూహ్య రుతుపవనాలు, క్షీణిస్తున్న కోరల్‌ రీఫ్‌ పర్యావరణ వ్యవస్థలు, అట్లాంటిక్‌ సముద్ర ప్రవాహాల్లో మార్పులతో ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లోకి పయనిస్తోంది. వీటికి అమెజాన్‌ అడవుల క్షీణత తోడైతే కార్చిచ్చుకు వాయువు తోడైనట్లు ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని నిపుణుల అంచనా.

అమెజాన్‌ అడవులు అధిక శాతం విస్తరించిన బ్రెజిల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడవుల నరికివేత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు  co2  సింక్‌ (కార్బన్‌ డైఆక్సైడ్‌ను పీల్చుకునే)గా ఉన్న అమెజాన్‌ ఫారెస్టు ప్రస్తుతం co2 సోర్స్‌ (ఉత్పత్తి కారకం)గా మారిందని సైంటిస్టులు హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్‌ అడవులు వదిలే కార్బన్‌డైఆక్సైడ్‌ పరిమాణం 20 శాతం మేర పెరిగిందన్నారు.

వాతావరణంలో co2 పెరగడం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ వాయువును పీల్చుకోవడంలో చెట్లు, మృత్తిక కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే చెట్ల నరికివేత ఊపందుకొని, మృత్తికలు సారహీనం కావడం జరుగుతుందో co2 నియంత్రణ అదుపుతప్పుతుంది. అమెజాన్‌ అడవులు దాదాపు 9000 కోట్ల టన్నుల co2ను నియంత్రిస్తుంటాయి. ఈ అడవుల క్షీణతతో ఇంత స్థాయిలో co2 వాతావరణంలోకి విడులయ్యే అవకాశాలు పెరుగుతాయి.

అప్పుడు దక్షిణఅమెరికాతో పాటు ప్రపంచమంతా ఫలితం అనుభవించాల్సిఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇంకా ఉందని అధ్యయన రచయతలు తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా అరణ్య రికవరీ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, చెట్ల నరికివేతను నియంత్రించడం, పంటమార్పిడి ద్వారా మృత్తిక సారహీనం కాకుండా కాపాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.  

ప్రత్యేకతలు..
► 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో అమెజాన్‌ వర్షారణ్యం వ్యాపించి ఉంది.  
► అమెజాన్‌ పరీవాహక ప్రాంతంలో  75 శాతాన్ని ఈ అడవులు ఆక్రమించాయి.
► కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20 శాతాన్ని మనిషి కబళించాడు.
► ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసముంటున్నారు.  
► వీటిపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు.
► ప్రపంచంలోని జీవ ప్రజాతుల్లో పదింట ఒకటి ఈ వర్షారణ్యాల్లో కనిపిస్తుంది.
►  ప్రపంచంలోనే అత్యధిక వృక్ష, జీవ ప్రజాతులకు ఈ అడవులు ఆవాసం.
► ఇందులో సుమారు 16 వేల ప్రజాతులకు చెందిన దాదాపు 39,000 కోట్ల చెట్లున్నట్లు అంచనా.
► ఈ అడవుల్లో 25 లక్షల రకాల కీటకాలు, 2, 200 రకాల చేపలు, 1,294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి.

– నేషనల్‌ డెస్క్, సాక్షి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement