అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాల పరిధిలో విస్తరించిన మహారణ్యం ఇది. కొద్ది సహస్రాబ్దాల కిందట ఇక్కడ పురాతన నాగరికతలు వర్ధిల్లేవి. ఆనాటి ప్రజలు ఇక్కడ తమ ఆవాసం కోసం కొన్ని నగరాలను నిర్మించుకున్నారు. దట్టమైన అడవిలో ఇన్నాళ్లూ మరుగునపడిన ఆ నగరాలు ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తల చొరవతో వెలుగు చూస్తున్నాయి. ఈ ఫొటోలు ఇటీవల అమెజాన్ అడవిలో బయటపడిన ఒక పురాతన నగరానికి చెందినవి. ఈక్వడార్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు డ్రోన్ ద్వారా తీసిన ఫొటోల్లో ఈ పురాతన నగరం బయటపడింది.
ఆండెస్ పర్వతాలకు దిగువన ఉపానో లోయలో బయటపడిన ఈ నగరంలోని శిథిల అవశేషాలపై శాస్త్రవేత్తలు లేజర్ సెన్సరీ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు జరిపారు. ఈ నగరం పరిధిలో మట్టి, రాళ్లు ఉపయోగించి నిర్మించిన దాదాపు ఆరువేల కట్టడాలను, వ్యవసాయ క్షేత్రాలను, పంట కాలువలను, ఇళ్లు ఉండే వీథుల్లో ముగురునీటి కాలువలను, నగరంలో సంచరించడానికి వీలుగా ముప్పయి మూడు అడుగుల వెడల్పున నిర్మించుకున్న విశాలమైన రహదారులను గుర్తించారు.
ఇక్కడి కట్టడాల్లో నివాస గృహాలు మాత్రమే కాకుండా, ఊరంతా ఉమ్మడిగా ఉపయోగించుకునే సమావేశ మందిరాలు, పిరమిడ్లతో కూడిన శ్మశాన వాటికలు వంటి నిర్మాణాలను గుర్తించారు. చాలా కట్టడాలు నేలకు మూడు మీటర్ల లోతున మట్టిలో కప్పెట్టుకుపోవడంతో శాస్త్రవేత్తలు తవ్వకాలను జరిపి, వాటిని పరిశీలించారు. దాదాపు రెండువేల ఏళ్ల కిందట ఈ నగరంలో పదివేల మంది నుంచి ముప్పయి వేల మంది వరకు నివాసం ఉండేవారని, ఇక్కడి ప్రజలు ఏ పరిస్థితుల్లో అంతరించిపోయి ఉంటారో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధనలు సాగించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
(చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!)
Comments
Please login to add a commentAdd a comment