
ఆహా ఏమి రుచి... వంకాయ
తిండి గోల
నవనవలాడే వంకాయలతో కూర చేస్తే ఆఖరు బంతివారికి అందనే అందదని చెప్పుకుంటుంటారు పెద్దవాళ్లు. వంకాయవంటి కూరయు లేదు... అంటూ తెగ పొగిడించుకునే ఈ కూరగాయను ప్రాచీన హిందూమత శ్రాద్ధ కర్మలలో నిషేధించేవారట. దీంతో ఈ కాయగూర పాశ్చాత్యులదే తప్ప భారతీయులది కాదని తెలుస్తోంది. అయితే, ఇది ఎప్పుడు మన దేశాన అడుగుపెట్టిందనే లెక్కలు అంతగా లేవు. కానీ, బ్రిటిషర్ల కాలంలోనే మన దేశంలో తన ముచ్చికను ముందుగా మోపి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు.
దక్షిణ ఆసియా, దక్షిణ అమెరికాలో వంకాయను ‘బ్రింజాల్’ అని, ఉత్తర అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, బ్రిటీషర్లు ‘ఎగ్‌ప్లాంట్’, గార్డెన్ ఎగ్.. వంటి పేర్లతో పిలుస్తుంటారు. అక్కడి పరిశోధకులు ఈ కూరగాయసాగులో పాటించిన అధునాతన పద్ధతుల వల్ల వందల రకాల ఆకృతులు, రంగులతో దర్శనమిస్తుంది వంకాయ. మన నోట మాత్రం ఆహా ఏమి రుచి అని కూరను తిన్న ప్రతిసారీ అనిపిస్తూనే ఉంది. వంకాయ పాశ్చాత్యులదే అయినా దాన్ని నడ్డి విరిచి వండేది మనమే కాబట్టి, రుచి క్రెడిట్ మన పాకశాస్త్ర ప్రవీణులకే ఇచ్చేయాలి. కాదంటారా!!