చుట్టూ చేపలు... మధ్యలో మనుషులు
ఒలింపిక్స్ ముగిసి రెండు మూడు నెలలు అవుతోంది. కానీ బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో మరో సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్‌కు సిద్ధమవుతోంది. మొత్తం దక్షిణ అమెరికాలోనే అతిపెద్దదైన అక్వేరియం వచ్చే నెల తొమ్మిదిన ప్రారంభం కానుంది. అక్కడెక్కడో యూరప్‌లో కిలోమీటర్ లోతైన అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉంటే... ఇక్కడ 650 అడుగుల పొడవైన అండర్‌వాటర్ టన్నెల్ ఉందీ చేపలతొట్టిలో. దాదాపు 45 లక్షల లీటర్ల నీటిని 28 ట్యాంకుల్లో నింపడం ద్వారా ఈ అక్వేరియంను సిద్ధం చేశారు.
ఈ ట్యాంకులన్నింటినీ కలుపుతూ ఈ టన్నెల్ ఉంటుందన్నమాట. ఆక్వా రియో అని పేరుపెట్టన ఈ అక్వేరియంలో దాదాపు 350 జాతుల జలచరాలు 8000 వరకూ ఉంటాయి. సింగపూర్ తదితర దేశాల్లో అండర్ వాటర్ టన్నెల్స్‌తో కూడిన అక్వేరియంలు ఉన్నప్పటికీ ఇంత భారీస్థాయిలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని అంచనా. అక్వేరియంతోపాటు ఆక్వా రియోలో ఒక సర్ఫ్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం కూడా ఉంటాయి. జలచరాలను దగ్గర నుంచి చూడాలనుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కావాలంటే ఈ అక్వేరియంలో ఒక రాత్రి మొత్తం గడిపేందుకూ అవకాశముంది. ఇలాంటిదేవో ఇక్కడ ఒకటి అరా ఏర్పాట చేస్తే బాగుండు అనిపిస్తోంది కదూ.... నిజమే!