గ్రూప్ ‘సి’ టాపర్‌గా మెక్సికో
* వెనిజులాతో మ్యాచ్ ‘డ్రా’
* కోపా అమెరికా కప్
హూస్టన్: ఆరంభంలోనే ప్రత్యర్థి ఆధిక్యం పొందినా ఒత్తిడిని అధిగమించిన మెక్సికో చివర్లో గోల్ కొట్టి మ్యాచ్‌ను కాపాడుకుంది. దీంతో గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. కోపా అమెరికా కప్‌లో భాగంగా సోమవారం వెనిజులాతో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ రెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరాయి. మ్యాచ్ ఆరంభమైన 10వ నిమిషంలోనే వెనిజులా గోల్ చేసి మెక్సికోకు షాక్‌నిచ్చింది.
క్రిస్టియాన్ సాంటోస్ హెడర్ ద్వారా ఇచ్చిన పాస్‌ను అందుకున్న వెలాజ్‌క్వెజ్ చక్కటి వ్యాలీతో గోల్‌ను సాధించాడు. అయితే ద్వితీయార్ధం 49, 56వ నిమిషాల్లోనూ స్కోరును సమం చేసేందుకు వచ్చిన అవకాశాలను మెక్సికో వినియోగించుకోలేకపోయింది. ఇక 80వ నిమిషంలో జీసస్ మాన్యుయల్ టెకాటిలో కొరోనా చేసిన గోల్‌తో మెక్సికో ఊపిరిపీల్చుకుంది. 84వ నిమిషంలో వెనిజులా నుంచి జోసెఫ్ మార్టినెజ్ గోల్ కోసం యత్నించినా మెక్సికో కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.
ఉరుగ్వేకు ఓ విజయం: కోపా అమెరికా కప్‌ను ఉరుగ్వే జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే నాకౌట్‌కు దూరమైన ఈ జట్టు గ్రూప్ ‘సి’ నామమాత్రపు మ్యాచ్‌లో 3-0తో జమైకాను ఓడించింది.