ఉరుగ్వే అవుట్
► కీలక మ్యాచ్‌లో వెనిజులా చేతిలో ఓటమి
► మెక్సికో, వెనిజులాకు క్వార్టర్స్ బెర్త్
► కోపా అమెరికా కప్
ఫిలడెల్ఫియా: ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15సార్లు చాంపియన్... బరిలోకి దిగితే ఎంతటి ప్రత్యర్థినైనా వణికించగల సత్తా ఉన్న జట్టు... ఒంటిచేత్తో విజయాలు అందించే ఆటగాళ్లకు కొదువేలేదు. కానీ కోపా అమెరికా కప్ టోర్నమెంట్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ఉరుగ్వే జట్టుకు ఏదీ కలిసిరాలేదు. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో వెనిజులా 1-0తో ఉరుగ్వేపై సంచలన విజయం సాధించి క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో ఉరుగ్వే పాయింట్లేమీ లేకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
1997 తర్వాత ఉరుగ్వే గ్రూప్ దశలోనే ఓడటం ఇదే తొలిసారి. గాయం కారణంగా స్టార్ ఆటగాడు లూయిస్ సారేజ్ ఈ మ్యాచ్ ఆడలేదు. డిఫెండర్ మ్యాక్సీ పెరీరా ఉరుగ్వే తరఫున అత్యధిక మ్యాచ్‌లు (113) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ సందర్భంగా డియాగో ఫ్లోరాన్‌ను అధిగమించాడు. వెనిజులా తరఫున సాలోమన్ రోండన్ (36వ ని.) ఏకైక గోల్ చేశాడు.
జమైకాపై మెక్సికో గెలుపు: మరో మ్యాచ్‌లో మెక్సికో 2-0తో జమైకాపై గెలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. మెక్సికో తరఫున జేవియర్ హెర్నాం డేజ్ (18వ ని.), ఓర్బీ పెరాల్టా (81వ ని.)లు గోల్స్ చేశారు. రెండో అర్ధభాగంలో స్ట్రయికర్ క్లెటాన్ డోనాల్డ్‌సన్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను రిఫరీలు తోసిపుచ్చడంతో జమైకా నిరాశకు గురైంది.