చిలీ 'సూపర్' షో
శాంతా క్లారా(యూఎస్): కోపా అమెరికా ఫుట్ బాల్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ చిలీ సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0 తేడాతో మెక్సికోను కంగుతినిపించి సెమీస్లోకి ప్రవేశించింది. చిలీ ఆటగాడు వార్గాస్ నాలుగు గోల్స్ చేసి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆట 16వ నిమిషంలో ఎడ్సన్ పచ్ తొలి గోల్ను అందించి చిలీని ఆధిక్యంలో నిలిపాడు.
అనంతరం 13 నిమిషాల వ్యవధిలో చిలీ ఆటగాడు వార్గాస్ హ్యాట్రిక్ గోల్స్ అదరగొట్టాడు. 44, 52, 57వ నిమిషాల్లో వార్గాస్ మూడు గోల్స్ సాధించాడు. ఆపై 74వ నిమిషంలో వార్గాస్ ఖాతాలో మరో గోల్ నమోదు చేశాడు. చిలీ మిగతా ఆటగాళ్లలో సాంచెజ్(49వ నిమిషం), ఎడ్సన్ పచ్(87వ నిమిషంలో) గోల్స్ నమోదు చేసి జట్టుకు 7-0 తేడాతో సంపూర్ణ విజయాన్ని అందించారు.
దీంతో చారిత్రాత్మక విజయం చిలీ ఖాతాలో చేరగా, ఒక ప్రధాన టోర్నమెంట్లో దారుణమైన ఓటమిని మెక్సికో తొలిసారి మూటగట్టుకుంది.. అంతకుముందు 1978 వరల్డ్ కప్ లో వెస్ట్ జర్మనీ చేతిలో 6-0తేడాతో మెక్సికో ఓటమి పాలైన తరువాత ఆ జట్టుకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన కావడం గమనార్హం.