వెనిజులా దేశ సందర్శనకు ఎవరూ వెళ్లొద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనించడం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతన్న నేపథ్యంలో వెనిజులా సందర్శన విషయంలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను మరోసారి జారీ చేసింది.
వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాము ఏమీ చేయలేమని అమెరికా పౌరులను ఆ దేశ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాన్నారు. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ తెలిపింది.
విస్తారమైన కరేబియన్ సముద్రతీరానికి, సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏటా లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తరువాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment