‘గోల్డెన్‌ వీసా’ నిబంధనలు! | Indonesia introduced a golden visa program to attract foreign investors | Sakshi
Sakshi News home page

‘గోల్డెన్‌ వీసా’ నిబంధనలు!

Published Fri, Jul 26 2024 1:17 PM | Last Updated on Fri, Jul 26 2024 3:15 PM

Indonesia introduced a golden visa program to attract foreign investors

విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇండోనేషియా ప్రత్యేక వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ‘గోల్డెన్‌ వీసా’ను అందుకోవాలంటే ఇన్వెస్టర్లు కనీసం 3,50,000 డాలర్ల(రూ.2.9 కోట్లు) నుంచి 50 మిలియన్‌ డాలర్లు(రూ.410 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిబంధనలను అనుసరించి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఈ వీసా చెల్లుబాటు అవుతుందని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది.

ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండోనేషియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఐదేళ్లు, పదేళ్ల కాలపరిమితికిగాను ‘గోల్డెన్ వీసా’లను ప్రవేశపెట్టింది. ఐదేళ్ల వీసా పొందడానికి వ్యక్తిగత పెట్టుబడిదారులు ఆ దేశంలో కనీసం 2.5 మిలియన్ డాలర్ల(రూ.20 కోట్లు)తో కంపెనీని స్థాపించాలి. పదేళ్ల వీసా కోసం 5 మిలియన్‌ డాలర్లతో(రూ.40 కోట్లు) సంస్థ ప్రారంభించాలి. కంపెనీ స్థాపించడానికి ఆసక్తి లేని వారు ఐదేళ్ల కోసం 3,50,000 డాలర్లు(రూ.2.9 కోట్లు), పదేళ్లకోసం రూ.5.8 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ నిధులను ఇండోనేషియా ప్రభుత్వ బాండ్‌లు, పబ్లిక్ కంపెనీ స్టాక్‌లు లేదా డిపాజిట్‌ల్లో పెట్టుబడి పెట్టాలి.

కార్పొరేట్ ఇన్వెస్టర్లు మాత్రం ఐదు సంవత్సరాల వీసా పొందేందుకు 25 మిలియన్‌ డాలర్లు(రూ.205 కోట్లు), పదేళ్ల కోసం 50 మిలియన్‌ డాలర్ల(రూ.410 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఇదే తరహా వీసా పథకాలను గతంలో కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు అందించాయి. కానీ ఈ పథకాలు సమర్థవంతంగా ఉద్యోగాలను సృష్టించలేవని, ఊహాజనిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని ఆయా దేశాలు నిర్ధారించాయి.

ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!

ఇండోనేషియా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం ట్రయల్ దశ ప్రారంభించింది. దాదాపు 300 మంది దరఖాస్తుదారులకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. దీని ద్వారా 123 మిలియన్‌ డాలర్ల(రూ.1,029 కోట్లు) పెట్టుబడులు సమకూరాయి. ఇండోనేషియా సంతతికి చెందిన విదేశీ పౌరులకు ప్రత్యేక హోదాను మంజూరు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే భారత్‌లోని కార్పొరేట్లు ఈ పథకాన్ని పరిశీలించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లోనూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్యక్రమం అమలులో ఉంది. దీని ప్రకారం భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఇండియాలో తాత్కాలికంగా నివసించడానికి, స్థానికంగా పని చేయడానికి, ప్రయాణించడానికి అనుమతులున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement