అమెరికాలో గ్రీన్ కార్డ్ పునరుద్ధరణ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఇటువంటివారి గ్రీన్ కార్డ్ చెల్లుబాటును 36 నెలలు పొడిగిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది.
ఈ నిర్ణయం సెప్టెంబర్ 10 నుండి అమలులోకి వచ్చింది. యూఎస్‌సీఐఎస్ ప్రకారం.. గడువు ముగిసిన లేదా ముగింపునకు వచ్చిన గ్రీన్ కార్డ్ పునరుద్ధరణ కోసం ఫారమ్ I-90ని సమర్పించిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఫారమ్ I-90 రసీదు ఉన్నవారికి గతంలో గ్రీన్ కార్డ్ చెల్లుబాటు పొడిగింపు 24 నెలలు ఉండేది. ఇప్పడది 36 నెలలు అయింది.
గ్రీన్‌కార్డ్ కాల వ్యవధి ముగిసినప్పుడు యూఎస్‌లో నివాసముంటున్నవారు తమ చట్టపరమైన స్థితికి రుజువుగా గడువు ముగిసిన గ్రీన్ కార్డ్‌తో పాటు కార్డ్ పొడిగింపు నోటీసులను సమర్పించవచ్చు. కొత్త కార్డు కోసం వేచి ఉన్నప్పుడు ఇది ఉపాధి అధికారంగా కూడా పనిచేస్తుంది.
అమెరికాలో పనిచేసే వృత్తి నిపుణులకు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డును జారీ చేస్తారు. దీని కాల వ్యవధి పదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసినవెంటనే కానీ లేదా మరో 6 నెలల్లో గడువు ముగుస్తుందనగా కానీ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రీన్ కార్డ్ హోల్డర్లు యునైటెడ్ స్టేట్స్ నుంచి బయటి దేశాలకు రాకపోకలు సాగించవచ్చు. అయితే ఏడాది కంటే ఎక్కువ కాలం దేశం విడిచి ఉండేందుకు వీలుండదు. ఒక వేళ అలా ఉంటే వారి గ్రీన్ కార్డ్ రద్దవుతుంది. వారు మళ్లీ దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment