భారత్ నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2024లో ఇప్పటివరకు 12 లక్షల మంది అమెరికా వచ్చినట్లు యూఎస్ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. వీసాల కోసం పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోందన్నారు. దాంతో భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 2,50,000 వీసా అపాయింట్‌మెంట్‌లను కేటాయించినట్లు పేర్కొన్నారు.
అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటక ప్రకారం..2024లో ఇప్పటివరకు 1.2 మిలియన్లకు(12 లక్షలు) పైగా భారతీయులు యుఎస్‌కు వచ్చారు. 2023లో ఇదే కాలంతో పోలిస్తే వీరి సంఖ్య 35 శాతం పెరిగింది. సుమారు 60 లక్షల మంది భారతీయులు యూఎస్‌ను సందర్శించడానికి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నారు. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి వీసాల కోసం భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. దాంతో భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 2,50,000 వీసా అపాయింట్‌మెంట్‌లను కేటాయించారు.
ఈ సందర్భంగా యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ..‘ఇండియా-యూఎస్ మిషన్‌లో భాగంగా గడిచిన రెండేళ్లలో పది లక్షల మంది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది వేసవిలో స్టూడెంట్ వీసాలను రికార్డు స్థాయిలో ప్రాసెస్ చేశాం. ఇరు దేశాల మధ్య వ్యాపారాలను సులభతరం చేయడానికి, పర్యాటకాన్ని పెంపొందించడానికి దృష్టి సారిస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరు దేశాల మధ్య వీసా ప్రక్రియను మెరుగుపరచాలని, వేగవంతం చేయాలని నిర్దేశించారు. ఇండియా నుంచి అమెరికా రావాలనుకుంటున్న వారి డిమాండ్‌ను తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: రూ.16 లక్షల కోట్ల మార్కు దాటిన ‘మార్క్’ సంపద!
అమెరికా గతంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం..అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు జారీ చేసిన మొత్తం 6,00,000 విద్యార్థి వీసాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారతీయులే ఉండడం విశేషం. సందర్శకుల వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం వేచి ఉండే సమయాన్ని 75 శాతానికి తగ్గించారు.
Comments
Please login to add a commentAdd a comment