వచ్చే 48 గంటల్లో ఏ క్షణంలోనైనా దాడి
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం
వాషింగ్టన్: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ఎంబసీపై దాడిలో ఆర్మీ జనరళ్లు, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.
దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతొల్లా అలీ ఖమేనీ చెబుతున్నాసరే ఆ దేశం తన నిర్ణయంపై వెనకడుగు వేసే పరిస్థితి లేదని కథనం వెల్లడించింది. నిజంగా దాడి జరిగితే పశి్చమాసియాలో యుద్ధజ్వాలలు ఊహించనంతగా ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది.
యుద్ధ సంసిద్దతపై వార్ కేబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్‌తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్.. ఇరాన్‌తోనూ కయ్యానికి కాలు దువ్వడంపై పశి్చమదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్‌పై దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెబుతుండగా ఇంతవరకూ ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఏప్రిల్ ఒకటోతేదీ నాటి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్‌సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.
ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి
పౌరులకు భారత సర్కార్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కారి్మకులుగా భారత్ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్ శుక్రవారం స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment