శిథిలాల మధ్య తమ ఇళ్లు వెతుక్కుంటున్న స్థానికులు
అంతటా రాజ్యమేలుతున్న శ్మశాన వైరాగ్యం
గాయాల గాజాలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
వందల లారీల కొద్దీ నిత్యావసరాలు, ఔషధాల తరలింపు
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే.
కుప్పకూలిన వ్యవస్థలు
గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.
యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది.
పునర్నిర్మాణానికి చాలా సమయం
ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్‌లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
అణువణువునా విధ్వంసం
యుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.
ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.
నెమ్మదిగా మొదలైన సాయం
కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.
స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment