రివైండ్‌ 2024: చేదెక్కువ... తీపి తక్కువ! | Sakshi Special Story About Looking back 2024 In The World | Sakshi
Sakshi News home page

రివైండ్‌ 2024: చేదెక్కువ... తీపి తక్కువ!

Published Sun, Dec 29 2024 5:39 AM | Last Updated on Sun, Dec 29 2024 5:39 AM

Sakshi Special Story About Looking back 2024 In The World

2024 ఏడాది మన స్మృతి పథం నుంచి మరలిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు గుర్తులుగా మిగిల్చిపోతోంది. దశాబ్దాల బషర్‌ అసద్‌ నిరంకుశ పాలన నుంచి సిరియాకు తిరుగుబాటుదారులు స్వేచ్ఛ కల్పిస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఓటర్లు దుందుడుకు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి పాలనా పగ్గాలు అప్పజెప్పారు. బంగ్లాదేశ్‌ విమోచన పోరాటయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థుల చేసిన ఉద్యమం ధాటికి షేక్‌ హసీనాను అధికార పీఠం నుంచి దిగిపోయి భారత్‌కు పలాయనం చిత్తగించారు.

 ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యోదంతం మరకలను భారత్‌కు పూసేందుకు కెనడా బరితెగించింది. అందుకు దీటుగా దౌత్యవేత్తలను బహిష్కరించి, భారత్‌ తీవ్ర నిరసన తెలపడంతో బాగా క్షీణించిన ఇరు దేశాల సత్సంబంధాలు వంటి ఎన్నో ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీపికబుర్లనూ 2024 మోసుకొచ్చింది. 

ప్లాస్టిక్‌భూతం భూమండలాన్ని చుట్టేస్తున్న వేళ పర్యావరణహిత ప్లాస్టిక్‌ను జపాన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్‌ వలలో చిక్కుకున్న చిన్నారులను దాని నుంచి బయటపడేసేందుకు ఆ్రస్టేలియా వంటి పలు దేశాలు టీనేజర్ల ‘సోషల్‌’వినియోగంపై ఆంక్షలు విధించాయి. అసాధ్యమనుకున్న రాకెట్‌ టెక్నాలజీని స్పేస్‌ఎక్స్‌ సాధించి చూపింది. ప్రయోగించాక తిరిగొస్తున్న రాకెట్‌ సూపర్‌హెవీ బూస్టర్‌ను ప్రయోగవేదిక భారీ రోబోటిక్‌ చేతితో తిరిగి ఒడిసిపట్టి ఔరా అనిపించింది. 2024 ప్రపంచపుస్తకంలోని కొన్ని ముఖ్య పేజీలను తరచిచూస్తే...

ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం 
ఏప్రిల్‌లో సిరియాలోని తమ దౌత్యకార్యాలయంపైకి ఇజ్రాయెల్‌ జరిపిన దాడితో ఇరాన్‌ వీరావేశంతో ఇజ్రాయెల్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దూకింది. నెలల తరబడి గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌పైకి బాంబులేసి కొత్తగా ఇరాన్‌ యుద్ధంలో తలదూర్చింది. దీంతో హమాస్‌ నుంచి ఇజ్రాయెల్‌ తన దృష్టినంతా ఇరాన్‌పై నిలిపింది. దాని పర్యవసానాలను ఇరాన్‌ తీవ్రంగా చవిచూసింది. ఇజ్రాయెల్‌ భీకర దాడులను తట్టుకోలేక ఇరాన్‌ దాదాపు చేతులెత్తేసింది. తూర్పు అజర్‌బైజాన్‌ సరిహద్దు ప్రాంతంలో డొక్కు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం రైసీ చనిపోయారు. కీలక నేత మరణంతో ఇజ్రాయెల్‌తో పోరులో అంతర్జాతీయంగా సైనికసాయం సాధించడంలోనూ ఇరాన్‌ విఫలమైంది.   

పేజర్లు, వాకీటాకీల ఢమాల్‌ ఢమాల్‌ 
యుద్ధవ్యూహాల చరిత్రలో ఎన్నడూలేనంత వినూత్న శైలిలో శత్రువుల పీచమణచడంలో తమది అందవేసిన చేయి అని ఇజ్రాయెల్‌ మరోసారి నిరూపించుకున్న సంఘటన ఇది. హమాస్‌కు మద్దతుపలుకుతున్న హెజ్‌»ొల్లా ఉగ్రమూలాలను ఇజ్రాయెల్‌ భారీగా దెబ్బకొట్టింది. తామే సృష్టించిన ఒక డొల్ల కంపెనీ ద్వారా వేలాదిగా పేజర్లు, వాకీటాకీలను హెజ్‌»ొల్లాతో కొనిపించి, అవి డెలివరీ అయ్యేలోపే వాటిల్లో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్‌ బాంబును అమర్చి హెజ్‌»ొల్లా మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ చావుదెబ్బతీసింది. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో ఏకకాలంలో వేలాది పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది. దీంతో దాదాపు 4,000 మంది రక్తసిక్తమయ్యారు. డజన్ల మంది చనిపోయారు. ఈ దాడి దెబ్బకు లెబనాన్‌లో సామాన్యులు సైతం ఏసీలు, రేడియోలు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను వాడేందుకు వణికిపోయారు.

కయ్యానికి కాలుదువ్విన కెనడా 
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యోదంతంలో భారత ప్రమేయం ఉందంటూ అక్కడి భారత హైకమిషన్‌కే నోటీసులిచ్చి విచారణ జరిపేందుకు కెనడా సాహసించి భారతదేశ ఆగ్రహానికి గురైంది. వెంటనే ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలు, ఎంబసీలు, కాన్సులేట్ల సిబ్బందిని వెనక్కి పంపేసి, సొంత దౌత్యాధికారులను వెనక్కి రప్పించి భారత్‌ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. కెనడా సైతం అలాంటి దుందుడుకు చర్యకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య దౌత్య సత్సంబంధాలు దారుణంగా క్షీణించాయి.   

బంగ్లాదేశ్‌లో కూలిన హసీనా ప్రభుత్వం 
బంగ్లాదేశ్‌ విమోచనోద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు, ప్రవేశాల్లో రిజర్వేషన్లపై విద్యార్థి లోకం కన్నెర్రజేయడంతో ప్రధాని షేక్‌ హసీనా కాళ్లకు పనిచెప్పాల్సి 
వచ్చింది. హుటాహుటిన ఢాకాను వదిలి ఢిల్లీకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, హిందూ మైనారిటీలపై దాడులతో బంగ్లాదేశ్‌ ప్రభ అంతర్జాతీయంగా ఒక్కసారిగా మసకబారింది. పరిస్థితిని కాస్తంత చక్కబెడతానంటూ తాత్కాలికంగా పగ్గాలు చేపట్టిన యూనుస్‌ కూటమి ఇప్పుడేం చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యమాలను అణచేస్తూ వేలమంది మరణాలకు బాధ్యురాలైన హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ కోరడం, భారత్‌ స్పందించకపోవడం చూస్తుంటే పొరుగుదేశంలో భారత్‌కు సఖ్యత చెడే విపరిణామాలే కనుచూపుమేరలో కనిపిస్తున్నాయి.  

అగ్రరాజ్యంపై రిపబ్లికన్‌ జెండా రెపరెపలు 
మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌ నినాదంతో దూసుకొచ్చి అలవోకగా అగ్రరాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్న రిపబ్లికన్ల అగ్రనేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు 2025 ఏడాదికి హాట్‌టాపిక్‌ వ్యక్తిగా మారారు. ముఖాముఖి చర్చలో బైడెన్‌ను మట్టికరిపించి తన గెలుపును దాదాపు ఖాయం చేసుకున్న ట్రంప్‌ ఆతర్వాత రేసులో దిగిన కమలా హారిస్‌పై వ్యక్తిగత, విధానపర నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసి నెగ్గుకురావడం విశేషం. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానన్న ప్రతిజ్ఞను ట్రంప్‌ ఏమేరకు నెరవేరుస్తారో వేచిచూడాలి. తమపై ఎక్కువ పన్ను వేసే భారత్‌పై అధిక పన్నులు మోపుతానని, తమకు భారంగా మారిన కెనడాపై అధిక ట్యాక్స్‌ వేస్తానని ట్రంప్‌ చెప్పారు. అక్రమ వలసదారులను కట్టకట్టి బయటకు పంపేస్తానన్నారు. నైతిక నిష్టలేని వ్యక్తులను కీలక పదవులకు నామినేట్‌ చేస్తూ ట్రంప్‌ తన ఏకపక్ష ధోరణిని ఇప్పటికే బయటపెట్టుకున్నారు.  

సిరియాలో బషర్‌కు బైబై 
తండ్రి నుంచి వారసత్వంగా పాలన మాత్రమే కాదు నిరంకుశ లక్షణాలను పుణికిపుచ్చుకున్న బసర్‌ అల్‌ అసద్‌కు తిరుగుబాటుదారులు ఎట్టకేలకు చరమగీతం పాడారు. తిరుగుబాటుదారుల మెరుపు దాడులతో అసద్‌ హుటాహుటిన రష్యాకు పారిపోయారు. దీంతో సిరియన్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాసనలు కొట్టే తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఇకపై సిరియా ఏపాటి అభివృద్ధి ఫలాలను అందుకుంటుందోనని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎవరికి వారు కొంత ప్రాంతాలను పాలిస్తున్న వేర్పాటువాదులను ఏకం చేసి ఐక్యంగా దేశాన్ని పాలించాల్సిన బాధ్యత ఇప్పుడు హయత్‌ తహ్రీర్‌ అల్‌షామ్‌ అధినేత అబూ మొహమ్మద్‌ అల్‌ జులానీ మీద పడింది.  

రష్యా నేలపైకి ఉక్రెయిన్‌ సేనలు 
నెలల తరబడి జరుగుతున్న ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో 2014లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆగస్ట్‌ ఆరున రష్యాలోని కురస్క్‌ ఒబ్లాస్ట్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ సేనలు ఆక్రమించాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని మరో దేశం ఆక్రమించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ సేనల దూకుడుకు కళ్లెం వేసేందుకు రష్యా భూతల, గగనతల దాడులకు తెగబడింది. మళ్లీ దాదాపు సగంభూభాగాన్ని వశంచేసుకోగల్గింది. ఇంకా అక్కడ రోజూ భీకర పోరు కొనసాగుతోంది. మరోవైపు రష్యా తరఫున పోరాడుతూ ఉత్తరకొరియా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పశి్చమదేశాల నుంచి అందుతున్న దీర్ఘశ్రేణి మిస్సైళ్లతో ఉక్రెయిన్‌ వచ్చే ఏడాది యుద్ధాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందోమరి.

దక్షిణకొరియాలో ఎమర్జెన్సీ 
పార్లమెంట్‌లో మెజారిటీలేక, తెచి్చన బిల్లులు ఆమోదం పొందక తీవ్ర అసహనంలో ఉన్న దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ డిసెంబర్‌ మూడోతేదీన మార్షల్‌ లా ప్రకటించారు. దీంతో చిర్రెత్తుకొచి్చన విపక్షపారీ్టల సభ్యులు పార్లమెంట్‌ గోడలు దూకివచి్చమరీ మెరుపువేగంతో పార్లమెంట్‌ను సమావేశపరచి మార్షల్‌ లాను రద్దుచేస్తూ సంబంధిత తీర్మానంపై ఓటింగ్‌ చేపట్టి నెగ్గించుకున్నారు. దీంతో కేవలం ఆరు గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తేశారు. మార్షల్‌ లాను ప్రయోగించి దేశంలో అస్థిరతకు యతి్నంచారంటూ అధ్యక్షుడిపై విపక్షాలు అభిశంసన తీర్మానం తెచ్చాయి. తొలి తీర్మానం అధికార పార్టీ సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది.  

బగ్‌ దెబ్బకు ‘విండోస్‌’ క్లోజ్‌ 
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ఒక చిన్న అప్‌డేట్‌ పేద్ద సమస్యను సృష్టించింది. జూలైలో విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్‌’సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్‌ సెన్సార్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను మైక్రోసాఫ్ట్‌ పరిష్కరించింది.

పర్యావరణహిత ప్లాస్టిక్‌! 
మనం వాడే ప్లాస్టిక్‌ తొలుత మురుగు నీటితో ఆ తర్వాత నదీజలాల్లో చివరకు సముద్రాల్లో కలుస్తోంది. ప్రపంచముప్పుగా మారిన ప్లాస్టిక్‌కు చెక్‌ పెట్టేందుకు జపాన్‌ శాస్త్రజ్ఞులు పర్యావరణహిత ప్లాస్టిక్‌ను సృష్టించారు. సముద్రజలాలకు చేరగానే కేవలం 10 గంటల్లో నాశనమయ్యే ప్లాస్టిక్‌ అణువులను వీళ్లు తయారుచేశారు. నేలలో కలిస్తే కేవలం 10 రోజుల్లో ఇది విచి్ఛన్నమవుతుంది. సింగ్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ల బదులు ఈ కొత్తతరహా ప్లాస్టిక్‌ త్వరలోనే వాణిజ్యస్థాయిలో ఉత్పత్తయి ప్రపంచదేశాలకు అందుబాటులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు.

రోబోటిక్‌ చేయి అద్భుతం 
అంతరిక్ష ప్రయోగాలకు వ్యోమనౌకలు, కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగించే వందల కోట్ల ఖరీదైన రాకెట్‌ బూస్టర్‌లను మళ్లీ వినియోగించుకునేలా తయారుచేసి ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ అందర్నీ ఔరా అనిపించింది. ఇటీవల చేసిన ప్రయోగంలో నింగిలోకి దూసుకెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకుంటున్న భారీ రాకెట్‌బూస్టర్‌ను ప్రయోగవేదికపై అమర్చిన రోబోటిక్‌ చేయి జాగ్రత్తగా పట్టుకుని శెభాష్‌ అనిపించుకుంది. బూస్టర్‌ల పునరి్వనియోగంతో ఎంతో డబ్బు ఆదాతోపాటు బూస్టర్‌ తయారీలో వాడే ఖరీదైన అరుదైన ఖనిజ వనరుల వృథాను తగ్గించుకోవచ్చు. 

కృత్రిమ మేధ హవా 
ఆరిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) దిగ్గజా లు జాన్‌ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు భౌతికశాస్త్ర నోబెల్‌ను బహూకరించిన నోబెల్‌ కమిటీ సైతం ఈ ఏడాది కృత్రిమ మేధ ఆవశ్యకతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. ఏఐ చాట్‌బాట్‌లు దైనందిన జీవితంలో భాగ మైపోయాయి. లక్షల రెట్ల వేగంతో పనిచేస్తూ పురోగమిస్తున్న ఏఐ రంగం ఇప్పుడు మానవ మేధస్సుకు సవాల్‌ విసురుతోంది. డిజిటల్‌ దురి్వనియోగం బారినపడకుండా ఏఐను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రపంచదేశాలు ఇటీవల హెచ్చరించాయి.   

అత్యుష్ణ ఏడాదిగా దుష్కీర్తి 
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, పారిశ్రామికీకరణతో భూగోళం ఈ ఏడాది గతంలో ఎన్నడూలేనంతగా వేడెక్కింది. పారిశ్రామికవిప్లవం ముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోకుండా కాచుకోవాల్సిన జనం ఈ ఏడాదే అది మించిపోయేలా చేశారు. చరిత్రలో తొలిసారిగా ఒక్క ఏడాదిలోనే భూతాపంలో ఉన్నతి 1.5 డిగ్రీ సెల్సియస్‌ను దాటింది. ఎల్‌నినో కన్నా వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల వల్లే అత్యుష్ణ ఏడాదిగా 2024 చెడ్డపేరు తెచ్చుకుందని తాజా అధ్యయనాల్లో తేలింది.   

సూర్యుడి ముంగిట పార్కర్‌ సందడి 
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’వ్యోమనౌక నూతన చరిత్ర లిఖించింది. భగభగ మండే భానుడికి అత్యంత దగ్గరగా వెళ్లింది. తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు నెలకొల్పింది. పార్కర్‌ను 2018లో ప్రయోగించారు. అంతరిక్ష వాతావరణం, సౌర తుపానులపై లోతైన అవగాహన కోసం దీనిని తయారుచేశారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన, మళ్లీ జూన్‌ 19వ తేదీన సైతం భానుడి చేరువగా వెళ్లనుంది.     
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement