బంకర్లో ఉండగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం
అప్పట్నుంచీ జాడ లేని హషీం షఫియుద్దీన్
ట్రిపోలీపై దాడుల్లో హమాస్ అగ్ర నేత కూడా హతం
జెరుసలేం/బీరూట్/టెహ్రాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇటీవలే సారథి హసన్ నస్రల్లాతో పాటు పలువురు అగ్ర నేతలను కోల్పోయిన లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్‌బొల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. నస్రల్లా స్థానంలో సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు హషీం షఫియుద్దీన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు బలైనట్టు చెబుతున్నారు. దీన్ని అటు హెజ్‌బొల్లా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ ధ్రువీకరించడం లేదు.
అయితే శుక్రవారం బీరుట్ శివార్లలోని దాహియేపై ఇజ్రాయెల్ వైమానిక దళం చేసిన లక్షిత దాడుల అనంతరం ఆయన ఆచూకీ లేకుండా పోయినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అక్కడి బంకర్లలో హెజ్‌బొల్లా అగ్ర నేతలతో హషీం సమావేశమై ఉండగా పక్కా సమాచారం మేరకు ఇజ్రాయెల్ భారీగా బాంబుల వర్షం కురిపించిందని తెలిపాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న దాడుల వల్ల సహాయక బృందాలేవీ ఆ ప్రాంతానికి చేరలేకపోతున్నట్టు వివరించాయి. ఈ దాడుల్లో హషీం తీవ్రంగా గాయపడ్డట్టు హెజ్‌బొల్లా వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. మరోవైపు లెబనాన్‌పై దాడులను శనివారం ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేసింది.
దక్షిణం వైపునుంచి మొదలుపెట్టిన భూతల దాడులను కొనసాగిస్తూనే ఉత్తరాది నగరం ట్రిపోలీని కూడా వైమానిక దాడులకు లక్ష్యంగా చేసుకుంది. ట్రిపోలీలోని బెడ్డావీ పాలస్తీనా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో హమాస్ సాయుధ విభాగమైన అల్ ఖసాం బ్రిగేడ్స్ చీఫ్ సయీద్ అతల్లాతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా మరణించారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. వెస్ట్‌బ్యాంక్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడుల్లో చనిపోయిన 18 మందిలో తమ కమాండర్ తుల్కరెమ్ కూడా ఉన్నట్టు పేర్కొంది. దక్షిణాన ఒడైసే నగరాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందని హెజ్‌బొల్లా ఆరోపించింది. ఇప్ప టిదాకా 2,000 మందికి పైగా సామాన్యులు దాడులకు బలయ్యారని పేర్కొంది.
లెబనాన్–సిరియా సరిహద్దుపై బాంబుల వర్షం
లెబనాన్, సిరియాలను కలిపే కీలకమైన మస్నా బార్డర్ క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబులతో విరుచుకుపడి నేలమట్టం చేశాయి. దారి పొడవునా ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. దాంతో రెండు దేశాల మధ్య రవాణా, రాకపోకలతో పాటు సర్వం స్తంభించిపోయింది. దాంతో దాడుల నుంచి తప్పించుకునేందుకు పొట్ట చేతపట్టుకుని సిరియాకు వెళ్తున్న లక్షలాది మంది లెబనీస్ పౌరులు సరిహద్దుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రాసింగ్ గుండా గత 10 రోజుల్లో కనీసం మూడున్నర లక్షల మంది సిరియాకు తరలినట్టు సమాచారం. ఇక్కడి రెండు మైళ్ల పొడవైన సొరంగం గుండా ఇరాన్ నుంచి హెజ్‌బొల్లాకు భారీగా ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే దాడులు చేసినట్టు వివరించింది.
ఇరాన్ అణు స్థావరాలపై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు?
తనపై వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎప్పుడు, ఎలా దాడి చేయనుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై మాత్రం దాడులను సమర్థించబోమని ఆయన స్పష్టం చేయడం తెలిసిందే. కానీ వాటినే లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతేగాక ఇరాన్ చమురు క్షేత్రాలపైనా బాంబుల వర్షం కురిపించే అంశాన్ని ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే పశి్చమాసియాలోని దేశాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయని, యుద్ధం ఊహాతీతంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment