
పోలీసులకు ఫోన్ చేసిన నాలుగేళ్ల బుడతడు
అమెరికాలో వింత ఘటన
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్‌క్రీమ్‌ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్‌లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్‌చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది.
అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్
ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్‌లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్‌కు ఫోన్‌చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.
నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.
అమ్మను తీసుకెళ్లండి
911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్‌కాల్‌కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్‌క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్‌చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్‌క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్‌చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.
ఐస్‌క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్‌కాల్‌లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్‌చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్‌చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్‌క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది.
అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్‌క్రీమ్‌ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్‌క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment