
వెనిజులా పార్లమెంట్‌లో హింస
కారకస్: వెనిజులాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశం హింసాత్మకంగా మారింది. గురువారం ప్రభుత్వ మద్దతుదారులు దుడ్డు కర్రలు, పైపులతో నేషనల్ అసెంబ్లీలోకి చొరబడి ప్రతిపక్ష సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఆ తరువాత అధ్యక్షుడు మదురో మద్దతుదారులు పార్లమెంట్‌ను 9 గంటలపాటు ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తొలుత జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన పోలీసులు తర్వాత∙సైన్యంసాయంతో ఎంపీలను విడిపిం చారు.
ఉదయం సుమారు 100 మంది దుడ్డు కర్రలు, పైపులతో తొలుత పార్లమెంట్ ముందు గేటు, ఆ తరువాత ఇంటీరియర్ గార్డెన్, భవనం గేట్లను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కారిడార్‌లోకి చొచ్చుకెళ్లి చట్ట సభ్యులపై దాడి చేశారు. స్టన్ గ్రెనేడ్లను పేల్చారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని పాత్రికేయులను బెదిరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చేరారని ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. ప్రభుత్వ మద్దతుదారులు..ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉగ్రవాదులు, హంతకులు అని అరుస్తూ పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. పోలీసులు ఎట్టకేలకు ప్రతిపక్ష సభ్యులను బయటికి తీసుకురాగలిగారు.