
వెనిజులాలో ‘నోట్ల’ కష్టాలు మనకన్నా దారుణం
కారకాస్: మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టయింది వెనిజులా ప్రజల పరిస్థితి. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక బిడ్డలను సైతం వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు నికోలస్ మడురో వంద బోలివర్ నోట్లను హఠాత్తుగా రద్దు చేయడం వారి బతుకులను మరింత అగాతంలో పడేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా వంద బోలివర్ నోట్లను కొత్త కరెన్సీతో మార్చుకోవాలని దేశాధ్యక్షుడు గడువు విధించినా శుక్రవారం నాటికి కూడా కొత్త కరెన్సీ మెజారిటీ బ్యాంకులకు చేరుకోలేదు.
పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక తినడానికి తిండిలేక అలమటిస్తున్నామని బ్యాంకుల ముందు చాంతాడంతా క్యూల్లో నిలబడిన పేదలు, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. కొన్ని ఏటీఎంలలో ఇప్పటికీ కూడా పాత వంద నోట్లే వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడికక్కడ వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో వంద బోలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు గత ఆదివారం నాడు దేశాధ్యక్షుడు నికోలస్ హఠాత్తుగా రేడియోలో ప్రకటించారు. గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు 500 నుంచి 20,000 బోలివర్ నోట్లు ఆరు డినామినేషన్లలో చేరుకుంటాయని, అప్పటి నుంచి 72 గంటల్లోగా పాత నోట్లను మార్చుకోవాలని గడువు విధించారు. బుధవారం రాత్రి నుంచే బ్యాంకుల ముందు క్యూలు కట్టినా దేశంలోని చాలా బ్యాంకులకు డబ్బులురాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కరెన్సీ ముద్రణా సంస్థలు కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు.
‘నా ఆరేళ్ల పాపను సాదుకునేందుకు ఎవరికైనా ఇచ్చేస్తాను. గత అక్టోబర్‌లోనే మా పక్కింటి వాళ్లను అడిగాం. వారికి కుదరదని చెప్పారు. మా మామకు వచ్చే ఆరు డాలర్లకు సమానమైన పింఛనుపై పాపతో సహా నలుగురం బతుకుతున్నాం. కష్టమవుతోంది. మా దగ్గరుండి ఆకలితో చనిపోవడమో లేదా వ్యభిచారిగా మారడమో కాకుండా కాస్త డబ్బున్నవాళ్లు పెంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నాం’ అని 43 ఏళ్ల నిరుద్యోగ మహిళ జులే పుల్గర్ వాపోయారు. ఇప్పుడు ఇలాంటి వాళ్లు వెనిజులాలో ఎందరో ఉన్నారు.
ఇలా రోజుకు తమ పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సిందిగా డజనుకుపైగా తల్లిదండ్రులు తమ సంస్థ వద్దకు వస్తున్నారని కరిరుబానా అనే సాంఘిక సేవా సంస్థ తెలియజేసింది. మరికొంత మంది తల్లిదండ్రులు తమను సంప్రతించకుండానే తెల్లవారక ముందే తమ కార్యాలయం ముందు పిల్లలను వదిలేసి వెళుతున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాల్లో కొంత మంది పేద తల్లులు తమ పిల్లలను వదిలేసి వెళుతున్నారని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. భారత్‌లోలాగా వెనిజులా కూడా బ్యాంక్ ఖాతాలుండే వారు చాలా తక్కువ. వ్యాపార వర్గాల మధ్య కూడా ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతుంటాయి. చమురు విలువలు అపారంగా ఉన్న దేశంలో కూడా నోట్ల కష్టాలు తప్పడం లేదు.