బ్యాంకు అధికారులను చితక్కొట్టారు
అలహాబాద్ : బ్యాంకు అధికారులకు, ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలహాబాద్ బ్యాంకు శాఖ బయట రోడ్డుపైనే అధికారులు, ప్రజలు ఒక్కరినొక్కరూ కుమ్ములాడుకున్నారు. ఇద్దరు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులను తీవ్రంగా చితక్కొట్టారు. డబ్బులు ఇవ్వకుండా పదేపదే తిప్పించుకుంటున్నారని ఆగ్రహంతో ప్రజలు మండిపడ్డారు. ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వాగ్వాద వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
పాత నోట్లు రద్దైన దగ్గర్నుంచి ప్రజలు బ్యాంకుల ఎదుటే రోజుల తరబడి వేచిచూడటం, తీరా తమవద్దకు వచ్చే సరికి బ్యాంకుల్లో నగదు అయిపోయినట్టు అధికారులు చెప్పడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. గంటల కొద్దీ నిరీక్షణకు ఫలితం దక్కకపోవడంతో ప్రజలు బ్యాంకు అధికారులపై దాడికి పాల్పడుతున్నారు. ఇటీవలే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాల్దా శాఖను ప్రజలు ధ్వంసం చేశారు. అక్కడక్కడా బ్యాంకు శాఖ వద్ద ప్రజలు నిరసనలకు కూడా దిగుతున్నారు.