రెండు దేశాలు, ఒక ప్రయోగం | ABK Prasad writes on demonetisation in India and Venezuela | Sakshi
Sakshi News home page

రెండు దేశాలు, ఒక ప్రయోగం

Published Tue, Dec 20 2016 4:03 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

బ్యాంకులకు చేరిన వెనిజులా కరెన్సీ - Sakshi

బ్యాంకులకు చేరిన వెనిజులా కరెన్సీ

రెండో మాట
వెనిజులా అంతటా వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు కావడంతో ప్రజలు అశాంతితో దాడులకు, దోపిడీలకూ నడుం కట్టవలసి వచ్చినట్టే భారతదేశంలోనూ పేదలు, ఉద్యోగులు, ముసలీ ముతకా గంటల తరబడి, రోజులకొద్దీ నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి, సహనం కోల్పోయి పలుచోట్ల అశాంతితో దాడులు చేయడం, బ్యాంకర్లను వేధిం చడం, కొట్టడం జరుగుతోంది. అశాంతి మధ్య వెనిజులాలో నలుగురు చనిపోగా.. మన దేశంలో అలా చనిపోయిన వారి సంఖ్య 110 దాకా ఉన్నట్లు సమాచారం.

‘గ్రామీణ భారతదేశం నూటికి నూరుపాళ్లు నగదు లావాదేవీల మీదే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌) లావా దేవీల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా మార్చేముందు గ్రామీణ నిరక్షరాస్యత లాంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుని ఉండాల్సింది. అనా లోచితంగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం వల్ల కోట్లాదిమంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ చర్య వల్ల ఏ అవినీతిపరులని, నల్లధనం కూడబెట్టిన వారిని ప్రభుత్వం దెబ్బతీయాలనుకున్నదో అలాంటివారు తప్పిం చుకున్నారు. ఇంతకూ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందే దీనిని బయటకు వెల్లడించిన వారెవరో తెలియాలి.’  – జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి (సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. 18–12–16న జరిగిన అఖిల భారత బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ సమావేశంలో)

పాలకులు, పాలనా వ్యవస్థలు; వారి జెండాలు, ఎజెండాల సంగతి ఎలా ఉన్నా, అనుభవం కలిగిన ఒక న్యాయ నిపుణునిగా జస్టిస్‌ జీవన్‌రెడ్డి భారత ప్రజాబాహుళ్యం నాడిని పట్టుకుని స్పందించిన తీరు విశిష్టంగా ఉంది. దీనిని చూస్తుంటే ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనానికి బీజం ఎక్కడ ఉందో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో జాన్‌ ఫాస్టర్‌ డల్లెస్‌ ఒకనాడు వెల్లడిం చిన తీరు గుర్తుకు వస్తున్నది.

‘ఒక దేశాన్ని జయించడానికి రెండే మార్గాలు:
1. సాయుధ శక్తి ద్వారా ఆ దేశ ప్రజలను లొంగదీసుకోవడం. 2. ఆ దేశాన్నీ, ప్రజలనీ ఆర్థికంగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడం’ అన్నారు డల్లెస్‌. మెక్సికో మాజీ అధ్యక్షుడు పోర్టిటిల్లో తన దేశ స్వీయానుభవాన్ని రంగరించి ఇదే అంశాన్ని విశ్లేషించారు. ఈ పరిస్థితులకు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఎంతవరకు కారణమో ఆగ్రహంతో వివరిం చారు. ‘ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ సంస్థలు ప్లేగు వ్యాధిని వ్యాపింపచేసే ఎలుకలు’ అని పోర్టిటిల్లో వ్యాఖ్యానించారు. ఈ ఎలుకలను పెంచి పోషి స్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదమే ఆర్థిక, సైనిక అవసరాల కోసం తనపైన ఆధారపడిన దేశాల కరెన్సీలనూ, వాటి విలువలనూ శాసిస్తున్నది.

భారత్‌–వెనిజులా అనుభవాలు
1991లో కాంగ్రెస్, తరువాత బీజేపీ–పరివార్‌–ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్‌ ప్రజా వ్యతిరేక సంస్కరణలను బేషరతుగా అంగీకరించి, ఏనాడైతే అమలులోకి తెచ్చాయో, ఆనాటి నుంచే భారతీయ కరెన్సీ విలువ, దాని నిలకడ మన పాలకుల చేతి నుంచి జారిపోయాయి. 1967–68 సంవ త్సరంలో ఇందిరాగాంధీ హయాంలో డాలర్‌కు రూపాయి విలువలో తొలి పతనం ప్రారంభమైంది. తరువాత నేటికి రూపాయి విలువ కేవలం 20 పైసలకు దిగజారింది. డాలర్‌ ఒక్కంటికి రూ.6 చెల్లించిన దశ నుంచి నేడు రూ. 70లు ధారపోయవలసిన స్థితికి చేరుకున్నాం. ఇలాంటి దుర్దశలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని భావించడం వాస్తవదూరం కాదు. ఎక్కువ వినియోగంలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయడా నికి ప్రధాన కారణం డిజిటల్‌ లావాదేవీలకు అలవాటు పడిన గుత్త కంపె నీలు, కొన్ని ప్రభుత్వాలు నగదు రహిత వ్యవస్థ కోసం ఒత్తిడి చే యడమే.

భారత్‌ నోట్ల రద్దు తరువాత వెనిజులా కూడా అందుకు సాహసించింది. అమెరికా ఒత్తిడికి లొంగిన ఈ లాటిన్‌ అమెరికా దేశం తమ ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోటు బిల్‌ను రద్దు చేసుకుంది (అమెరికా డాలర్‌ ప్రకారం 100 బిల్‌ నోటు విలువ 15 సెంట్లు. అంటే ఒక డాలర్‌=వెనిజులన్‌ 100 బిల్‌లు). ఇటీవలి కాలం వరకు వెనిజులాలో చలామణిలో ఉన్న కరెన్సీలో 77 శాతం బిల్‌ రూపంలోనే ఉంది. అక్కడ చావెజ్‌ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికన్‌ చమురు సంస్థలను ఆయన జాతీయం చేయడంతో అగ్రదేశం కన్నెర్ర చేసింది. అయితే  ఆయన మీద కక్ష సాధించడానికి అమెరికా చేసిన యత్నం ఫలించ లేదు. చావెజ్‌ తరువాత అధికారంలోకి వచ్చిన మదురో (ఆయన అనుచ రుడే) అడ్డు తొలగించుకునేందుకు, దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేం దుకు అమెరికా కుట్ర పన్నింది. అక్కడి మాఫియాల ద్వారానే మరో పెద్ద నోటు 100 బోలివార్‌ కరెన్సీని నిల్వ చేయించి బిల్‌ విలువకు ఎసరు పెట్టింది. మదురో పైఎత్తు వేసి, మాఫియాలకు మద్దుతుగా నిలిచిన కొలంబియా, బ్రెజిల్‌ దేశాల సరిహద్దులను మూసేశారు. 100 బోలీవార్‌ నోటును రద్దు చేశారు. చలామణిలో ఉన్న పెద్ద నోటు రద్దు కావడంతో వెనుజులా ప్రజలు నిత్యావసరాలకు అల్లల్లాడిపోయారు. పెద్దపెట్టున ఆందోళన, నిరసన ప్రదర్శ నలకు దిగవలసి వచ్చింది.

వెనిజులా అంతటా వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు కావడంతో ప్రజలు అశాంతితో దాడులకు, దోపిడీలకూ నడుం కట్టవలసి వచ్చినట్టే భారతదేశంలోనూ పేదలు, ఉద్యోగులు, ముసలీ ముతకా గంటల తరబడి, రోజులకొద్దీ నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి, సహనం కోల్పోయి పలుచోట్ల అశాంతితో దాడులు చేయడం, బ్యాంకర్లను వేధించడం, కొట్టడం జరుగుతోంది. అశాంతి మధ్య వెనిజులాలో మూడు రోజుల్లో నలు గురు చనిపోగా మన దేశంలో గంటలకొద్దీ క్యూలలో నిలబడి వేసారి అలసి పోయి సొమ్మసిల్లి చనిపోయిన వారి సంఖ్య సుమారు 110 మంది దాకా ఉందని సమాచారం. అయితే–వెనిజులాలో ప్రెసిడెంట్‌ మదురో సకాలంలోనే (మూడు రోజుల్లోనే) ప్రజా బాహుళ్యం నాడిని, అశాంతిని గమనించి రద్దును నిలిపి వేయవలసి వచ్చింది.

ఆ పాఠం పనికిరాదా?
నోట్లరద్దు అనంతరం వెనిజులాలో కనిపించిన దృశ్యాలు ఇక్కడా కనిపించినా ఈ పాఠాన్ని మొండితనంవల్ల మోదీ ఆమోదించ నిరాకరిస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని అనేకమంది ప్రపంచవ్యాప్త (అమెరికన్‌లు సహా) ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నా, మూడే.. ఫిజ్, స్టాండర్డ్‌ అండ్‌ పూర్, మెరిలించ్‌ వంటి రేటింగ్‌ ఏజెన్సీలూ, విదేశీ పెట్టుబడి సంస్థలూ, మల్టీ నేషనల్‌ కంపెనీలూ  మాత్రమే స్వాగతించాయి. డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌)తంత్రం ద్వారా జరిపే ధన లావాదే వీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మోసాలకు నిలయమైనాయో ఉదా హరణలు అనేకం. అందుకే భారత గ్రామీణ వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న నగదు లావాదేవీల వ్యవస్థను ఒక్కసారిగా కూల్చి నిరక్షరాస్యులకు అంతు చిక్కని డిజిటల్‌ లావాదేవీల వ్యవస్థకు మరలడం వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకే ఎంత ప్రమాదమో–గత మూడేళ్లుగా మన దేశం సహా పలు ప్రపంచ దేశాలపై జరిగిన సైబర్‌ గ్యాంగ్‌ ముఠాల దాడులే నిదర్శనం. సైబర్‌ ఎటాక్స్‌ అంటే కన్పించని అజ్ఞాతశత్రువు జరిపే యుద్ధం లాంటిదిది. ఈ– మెయిల్స్, ఇతర డిజిటల్‌ సమాచార డేటాలు, యాహూ, జీ–మెయిల్, డాట్‌ కామ్‌ వ్యవస్థలన్నీ సైబర్‌ దాడులకు గురవుతూనే ఉన్నాయి. ఇటీవలనే ఈ డిజిటల్‌ టెక్నాలజీవల్ల సైబర్‌ నేరాలు (నేరస్థుడు కనబడడు–చిక్కడు– దొరకడు) మరింతగా పెరగనున్నాయని పోలీసు వర్గాలే వెల్లడించక తప్పడం లేదు!

ప్రపంచ ఘరానా బ్యాంకులలో ఒకటి జేపీ మోర్గాన్‌ సంస్థ ద్వీపాంతర బ్రాంచీలలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. ఈ ఘరానా బ్యాంకులో కొన్ని కోట్ల మంది ఖాతాదారుల ‘సెన్సిటివ్‌’ (అతికీలకమైన) సమాచారం కనుమ రుగైపోయింది. కానీ ఆ బ్యాంకు ఈ రహస్యాన్ని బయటకు పొక్క నివ్వకుండా తొక్కిపట్టేసింది. చివరికి ఈ సైబర్‌ దాడుల నుంచి అమెరికా రక్షణశాఖ వెబ్‌ సైట్, ‘నాసా’ వెబ్‌సైట్‌ని కూడా అజ్ఞాత నేరస్తులు మినహాయించలేదని గుర్తించాలి. అంటే దొంగ ఒకోసారి దొరకొచ్చు. మరోసారి దొరక్కపోవచ్చు! అందుకనే సైబర్‌ దాడులకు, కరెన్సీ నోట్ల రద్దు చర్యకు కూడా అవినాభావ సంబంధం ఉందని సైబర్‌ నిపుణులు భావిస్తున్నారు! ఫలానా వెబ్‌సైట్‌కి మీరు బదలాయిస్తే (ట్రాన్స్‌ఫర్‌) మీ డబ్బులు ఆదా అవుతాయని ఒక అజ్ఞాత నేరస్థుడు మొబైల్‌ సందేశాలు పంపుతుంటాడు. ఖాతాదార్లు బుట్టలో పడ డం, లక్షలు, కోట్లాది రూపాయలు కోల్పోవడం ఒక రివాజుగా  మారిందట! కనుకనే, పెద్ద నోట్లను రద్దు చేయడానికి ప్రయత్నించిన పాత సోవియట్‌ యూనియన్, మయన్మార్, జింబాబ్వే లాంటి దేశాలు చేతులు కాల్చుకు న్నాయి. నగదు రహిత లావాదేవీలు ఉన్న అమెరికా, కెనడా, జపాన్‌లు కూడా సైబర్‌ దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి.

అన్ని దేశాల అనుభవమూ అదే!
బలవంతాన జరిపే పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడి పోతుందని జింబాబ్వే, మయన్మార్‌ల అనుభవం. బ్లాక్‌ మార్కెటింగ్‌ను, దొంగ సరుకు దిగుమతులను, నల్లధనం అణచివేత పేరిట మయన్మార్‌ సైనిక ప్రభుత్వం తమ కరెన్సీ ‘క్యాత్‌’ను మూడుసార్లు రద్దు చేసినా ఫలితం శూన్యం. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ఇబ్బందులున్నా, భవిష్యత్తులో లాభాలుంటాయని నరేంద్ర మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌ భ్రమల్లోకి నెడు తున్నారు. ఇది ఎంత అసాధ్యమో కరెన్సీల ఆటుపోట్లను అధ్యయం చేసిన ప్రసిద్ధ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉండా ల్సిన నగదు తరిగిపోతున్నప్పుడు సరకుల ధరలు పడిపోతాయి. ముఖ్యంగా చిన్న, మధ్య రకం నోట్లు తరిగిపోయి వస్తువుల ధరలు పడిపోతాయి. నోట్ల ముమ్మరం దశ (ఇన్‌ఫ్లేషన్‌) ధరల పతనానికి (డిఫ్లేషన్‌) దారితీస్తుంది.

ఈ దుస్థితి చివరికి తమ కరెన్సీ పైనే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయే దశకు తీసుకువెళుతుంది. ఆసియా దేశాలలో ఒక్క పాకిస్తాన్‌ మాత్రమే కొత్త  డిజైన్‌ లతో కొత్త నోట్లను ముద్రించే ముందు పాత నోట్లను రద్దు చేస్తూ (2016 డిసెంబర్‌ నుంచే) వాటిని మార్చుకోవడానికి  ఒకటిన్నర సంవత్సరం పాటు వ్యవధి కల్పించింది. ఇవన్నీ ఎలా ఉన్నా, మన ‘‘చాయ్‌వాలా’’ మోదీ ప్రభుత్వ పరిస్థితి ఇలా పక్క తోవలు పట్టినా, అదే గుజరాత్‌లోని సూరత్‌లో పుట్టి పెరిగిన మరొక చాయ్‌వాలా ఆ దశ దాటి వడ్డీ వ్యాపారిగా రూపమెత్తి, లెక్కకురాని రూ. 12 కోట్ల ఆస్తులకు పడగెత్తిన వ్యక్తి ఆస్తిని ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నందుకు సంతృప్తిపడదామా?!

- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement