
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పేదరికం 2011–2019 మధ్య 12.3 శాతం మేర తగ్గినట్టు ప్రపంచబ్యాంకు తన చర్చా పత్రంలో తెలిపింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2011 నేషనల్ శాంపిల్‌సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) తర్వాత భారత్ గృహ వినియోగానికి సంబంధించిన సర్వే వివరాలను ఇంత వరకు వెల్లంచలేదు. దీనికితోడు పేదరికం, అసమానతలకు సంబంధించి గత పదేళ్లలో అధికారికంగా ఎటువంటి గణాంకాలను ప్రకటించలేదు’’అని ఈ చర్చా పత్రం రూపొందించడంలో భాగమైన ఆర్థికవేత్త సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్‌డెర్ వీడ్ తెలిపారు.
కరోనా సంక్షోభం తలెత్తిన 2020లో భారత్‌లో తీవ్ర పేదరికం రేటు 0.8 శాతానికి పరిమితం అయిందని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇందుకు సాయపడినట్టు లోగడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రూపొందించిన చర్చా పత్రం కూడా ప్రకటించడం గమనార్హం. ‘‘భారత్‌లో 2011–2019 మధ్య తీవ్ర పేదరికం 12.3 శాతం తగ్గింది. 2004–2011 మధ్య కాలంలో ఉన్న రేటుతో పోలిస్తే ఎంతో మెరుగుపడింది’’ అని ప్రపంచబ్యాంకు చర్చా పత్రం వివరించింది.
2016లో డీమోనిటైజేషన్ సమయంలో పట్టణాల్లో పేదరికం 2 శాతం పెరిగిందని.. ఆ తర్వాత గణనీయంగా క్షీణించినట్టు తెలిపింది. 2019లో వృద్ధి కుంటు పడడంతో గ్రామీణ పేదరికం 0.10 శాతం మేర పెరిగినట్టు పేర్కొంది. వినియోగంలో అసమానతలు పెరిగాయనడానికి ఎటువంటి ఆధారాల్లేవని ఆర్థికవేత్తలు ఈ చర్చా పత్రంలో స్పష్టం చేశారు. చిన్న రైతులకు ఆదాయం 10 శాతం మేర పెరిగినట్టు తెలిపారు.
చదవండి: చరిత్ర తెలియదు.. సంస్కృతీ తెలియదు..ఇది మన పరిస్థితి..!
Comments
Please login to add a commentAdd a comment