లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది | World Bank Report Says Extreme Poverty Dipped India | Sakshi
Sakshi News home page

లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది

Published Thu, Apr 21 2022 1:26 AM | Last Updated on Thu, Apr 21 2022 1:34 AM

World Bank Report Says Extreme Poverty Dipped India - Sakshi

భారతదేశంలో సగం జనాభాకు వంట గ్యాస్‌ అందుబాటులో లేదు. అదే స్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. పక్కా ఇండ్లు, పౌష్టికాహారం, వైద్యం సరేసరి. ఎంతోమందికి ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యమే లేని పరిస్థితి. అయినా దేశంలో పేదరికమే లేదని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం – పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో నిర్వచించి గందరగోళం సృష్టించడం! గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 4,200 రూపాయలు లభిస్తే ఆ కుటుంబం పేదరికంలో లేనట్టు లెక్క! అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 5,140 వస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టు! ఇలా పేదరికాన్ని మరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఆందోళనకరం.

‘‘పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నించడం దాతృత్వం కాదు. అది అసలైన న్యాయం. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగం. అంత మాత్రమే కాదు. ఇది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కు’’. దక్షిణాఫ్రికా విముక్తి పోరాట నాయకుడు, మానవ హక్కుల ప్రతీక నెల్సన్‌ మండేలా గుండెల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. 
భారతదేశంలో పేదరికాన్ని నిజంగా నిర్మూలించకుండా, ఒక రకంగా దానిని మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సామా జిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉన్నట్టు నమ్మించడానికి కొత్త కొత్త ప్రాతిపదికలను రూపొందిస్తున్నారు. పేదరికాన్ని రకరకాల పద్ధతుల్లో నిర్వచించి గందరగోళం సృష్టిస్తున్నారు. కనిపిస్తున్న పేదరికాన్ని మరుగుపరచడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోన్న పరిస్థితి అత్యంత ఆందోళనకరం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, ఇటీవల ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో పేదరికం తగ్గినదంటూ తేల్చి చెప్పారు. సుతీర్థరాయ్, రాయ్‌ వాండర్‌ వైడ్‌ అనే ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఆ నివేదికను రూపొందించారు. ఈ నెలలోనే ఆ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. 2011 నుంచి 2015 వరకు 3.4 శాతం పేదరికం తగ్గిందనీ, 2011లో 22.5 శాతం ఉండగా, అది 2015లో 19.1 శాతానికి తగ్గిందనీ ఆ నివేదిక బయటపెట్టింది. అంతే కాకుండా 2015 నుంచి 2019 వరకు ఎన్నడూలేని విధంగా 19.1 శాతం నుంచి పది శాతానికి పడిపోయింది. ఈ నాలుగేళ్ళలో ఏం జరిగిందో అర్థం కాదు. లెక్కల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. ఇది గ్రామీణ పేదరికం సంగతి. పట్టణ పేదరికం కూడా 2011లో 14.2 శాతం ఉండగా, 2015 వరకు అది 12.9 శాతానికి తగ్గింది. అదే విధంగా 2015 నుంచి 2019 వరకు 12.9 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది.

పేదరికాన్ని వారి రోజువారీ వినిమయ ఖర్చును లెక్కపెట్టడం ద్వారా అంచనా వేయడం ఒక పద్ధతి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ధారించడానికి రోజూ ఒక మనిషి 35 రూపాయల ఖర్చుకన్నా తక్కువ వినియోగం చేస్తే, అతడు పేదవాడిగా నిర్ధారించబడతాడని నిపుణులు, ప్రభుత్వాలు నిర్ణయించాయి. పట్టణ ప్రాంతాల్లో దానిని 42 రూపాయలుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉన్న కుటుంబానికి రోజుకు 140 రూపాయల ఆదాయం ఉంటే చాలు, పట్టణాల్లో నలుగురికి కలిపి 168 రూపాయలుంటే చాలు. దీన్ని వినిమయ ఖర్చు సూచిక అంటారు. 

2015 నుంచి 2019 వరకు పేదరికం తగ్గిందని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది: పెన్షన్లు, రైతు బంధుతో పాటు, ఇతర పథకాల పేరున డబ్బును నేరుగా ప్రజలకు అందించడం వలన, ప్రతి పేద కుటుంబానికి కనీసం 2,500 నుంచి 3,500 రూపాయల వరకు నగదు అందుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు 4,200 రూపాయలు లభిస్తే ఆ కుటుంబం పేదరి కంలో లేనట్టు లెక్క. పట్టణ ప్రాంతంలో నెలకు 5,140 రూపాయలు ఆదాయం ఉంటే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడినట్టు ప్రభుత్వం నిర్ధారిస్తుంది. 

రెండో విషయం: ప్రభుత్వాలు 2011లో సామాజిక ఆర్థిక కులగణన(ఎస్‌ఈసీసీ) నిర్వహించి అందులో పేదరికాన్ని గుర్తించడా నికి ఏడు అంశాలను పరిశీలించారు. ఆ ఏడింటిలో మట్టిగోడల ఇల్లు మాత్రమే ఉండాలి. ఆ ఇంటిలో 15 సంవత్సరాల నుంచి 59 వయస్సు ఉన్న మగవాళ్ళు ఉండకూడదు. ఆ ఇంటి యజమాని మహిళ అయి వుండాలి. ఆ ఇంటిలో దివ్యాంగులే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఇళ్ళల్లో ఇరవై ఐదేళ్లు పైబడిన వారెవరూ కూడా అక్షరాస్యులై ఉండకూడదు. భూమి లేని వారై ఉండాలి. అయితే ప్రధానంగా కూలీ మీద ఆధారపడి ఉండాలి. ఇవి సూచికలు. ఇటువంటి వాళ్ళనే పేదరికంలో ఉన్నట్టు గుర్తిస్తారు. ఇవి చదివిన వారెవరికైనా ఒకటి అర్థం అవుతుంది. ఈ దేశంలో పేదరికం లేదని! అందుకే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు ఇటువంటి నిర్ధారణకు రాగలిగాయి. ఈ విధంగా  ప్రభుత్వాలు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుకుని తిరుగుతున్నాయి.

అయితే మరొక అంశం ఉన్నది. అది కూడా ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ చేసిన సర్వే. ఆ సర్వే ప్రకారం భారత దేశంలో 25 శాతం మంది పేదరికంలో ఉన్నట్టు తేలింది. ఆ సంస్థ కేవలం అన్నం, కారం, నీళ్ళపప్పుతో తింటూ ఉంటే సరిపోదనీ, పేదరికం కేవలం తిండికి మాత్రమే పరిమితమై లేదనీ, పేదరికం బహుముఖీనమైనదనీ ప్రక టించి, 2021లో ఒక రిపోర్టును విడుదల చేసింది. అయితే ఈ నివేదిక గురించి అధికార పక్షం ఇప్పటి వరకు నోరెత్తలేదు. కానీ పాక్షికమైన విషయాన్ని అది కూడా కృత్రిమమైన ఆసరా, భరోసాలను లెక్కవేసి, ఇది గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. ప్రపంచబ్యాంకు నివేదిక వచ్చి, రెండు రోజులే అయ్యింది. ఇప్పటికే ఇది తమ ప్రభుత్వ గొప్పత నమని చాటింపు మొదలుపెట్టారు. 

కానీ తమ ప్రభుత్వమే స్థాపించిన నీతి ఆయోగ్‌ వెలువరించిన పేదరికం నిజాలను కూడా ఒకసారి పరిశీలిస్తే విజ్ఞతగా ఉంటుంది. దీనిని మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ) అంటారు. ఈ సర్వేలో పన్నెండు అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. అందులో పౌష్టికాహారం, శిశు, బాలల మరణాలు, శిశు సంరక్షణ, పాఠశాలలకు వెళ్ళే వయస్సు, స్కూల్‌కు హాజరయ్యే రోజుల వివ రాలు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, గృహ వసతి, ఆస్తులు, ఇంట్లో వస్తువులు, బ్యాంక్‌ ఎకౌంట్‌ వివరాలు, వీటన్నింటినీ పరిశీలించి పేదరికాన్ని నిర్ణయించారు. వీటి ఆధారంగానే నీతి ఆయోగ్‌ భారతదేశంలో నూటికి 25 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని తన ప్రాథమిక సర్వేలో తేల్చింది. దేశం మొత్తం మీద 25 శాతమైతే, అది గ్రామీణ ప్రాంతంలో 32.75 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.81 శాతంగా తేల్చారు. 
బహుముఖ పేదరికంలో బిహార్‌ 51.91 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు: జార్ఖండ్‌ 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌ 37.79 శాతం, మధ్యప్రదేశ్‌ 30.65 శాతం, మేఘాలయ 32.67 శాతం. తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాలు: గోవా 3.76 శాతం, సిక్కిం 3.82 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్‌ 5.59 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌ 7.62 శాతం. 

దేశంలో సగానికి పైగా జనాభాకు వంట గ్యాస్‌ అందుబాటులో లేదు. అదే స్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. 45.6 శాతం మందికి మంచి పక్కా ఇల్లు లేదు. 37.6 శాతం జనాభాకు పౌష్టికాహారం అందడం లేదు. 22.6 శాతం మంది తల్లులకు వైద్యం అందుబాటులో లేదు. 12.2 శాతం జనాభాకు ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యమే లేని పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతి నలుగురిలో ఒకరు జీవితంలోని ప్రధాన మైన రంగాల్లో లోటును ఎదుర్కొంటున్నారు. తమ జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయాలతో కాకుండా, ప్రభుత్వాలు తాత్కాలికంగా ఇచ్చే పెన్షన్ల ఆధారంగా ప్రజలను పేదరికం లిస్టులో నుంచి తీసి వేయడంలో కుట్ర దాగుంది. పేదరికం నుంచి బయటపడాలంటే జీవనోపాధుల ద్వారా లభించే ఆదాయం, దానితో వివిధ అంశాల్లో కనీస వసతులను, సౌకర్యాలను లెక్కవేయాలి. 

అంతేకానీ, అర్థసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం విజ్ఞత అనిపించుకోదు. నెల్సన్‌ మండేలా చెప్పినట్టు, పేదరికం నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు చేస్తున్న మాయాతెరలను తొలగించు కొని, జీవించే హక్కు కోసం, అది కూడా గౌరవప్రదమైన జీవితం కోసం పేదలే చైతన్య వంతమైన కార్యాచరణను రూపొందించు కోవాలి. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా! ఇదే ఇప్పుడు మనందరికీ మేల్కొల్పు కావాలి.


మల్లెపల్లి లక్ష్మయ్య,  వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement