యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది.
ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్‌లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది.
సబ్లేకు 11వ స్థానం
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు.
2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment