విజయోత్సవాల్లో భార్యతో మదురో
కారకస్: వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ నేత నికోలస్ మదురో(55) ఘనవిజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్ ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్‌కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికల్లో వెనిజువెలా గెలిచింది. శాంతి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది.
వెనిజువెలాలో అతిపెద్ద, శక్తిమంతమైన రాజకీయ శక్తిగా మనం చాలాకాలం ఉంటాం. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నేను నియంతనని ప్రతిపక్షాల చేసే విమర్శలు నన్ను బాధపెట్టవు. వెనిజువెలా ఆర్థికవ్యవస్థను అమెరికా, కొలంబియా దేశాల మద్దతు ఉన్న మాఫియాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాబోయే రెండేళ్లలో ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారిస్తాం’ అని పేర్కొన్నారు. వెనిజువెలాతో అనుసరిస్తున్న యుద్ధవైఖరిని అమెరికా పునఃసమీక్షించాలని మదురో విజ్ఞప్తి చేశారు. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మదురో ప్రభుత్వం ఎన్నికలకు ముందు, పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలకు, ఉల్లంఘనలకు పాల్పడిందని రెండో స్థానంలో నిలిచిన హెన్రీ ఫాల్కన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌కేంద్రాల సమీపంలో ‘రెడ్ టెంట్ల’ను ఏర్పాటుచేశారనీ, సంక్షేమ పథకాలకు అవసరమైన ‘ఫాదర్‌ల్యాండ్ కార్డు’లను మదురో మద్దతుదారులు అక్కడ స్కాన్ చేశారని వెల్లడించారు. కాగా, మదురో విజయంపై మయామీ, మ్యాడ్రిడ్‌లో వలసదారులు నిరసన తెలిపారు. వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు తేల్చిచెప్పాయి. తాజాగా మదురో విజయం నేపథ్యంలో వెనిజువెలా జీడీపీలో 25 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న చమురురంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment